పుట:Konangi by Adavi Bapiraju.pdf/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మొదటి ఉత్తరం

నెం. 65

షణ్ముగంచెట్టివీధి

త్యాగరాజనగరం

మద్రాసు,

18-4-41

గాఢ ప్రియమూర్తి కోనంగీ,

నీ కౌగిలింతలు, నీ చుంబనాలు రుచిచూచి, నీ శృంగార నాయకత్వంలో ఓలలాడి ఎన్నో సంవత్సరా లయినట్లుంది.

నువ్వు పెళ్ళి చేసుకున్నావని విన్నాను ప్రాణకాంతా! ఆ నీ భార్య నాబోటిదేనటగా! ఇదివరకే ఆరితేరిన ఘటం అటగా-ఎంతమందో కాలేజీ విద్యార్థుల కౌగలింతలో కరిగి వారి దాహం, ఆకలి కడుపునిండా తీర్చినదే నటగా!

సరే, నువ్వు డబ్బుకోసం అక్కడికి చేరి ఉంటావు. ఒకవారం రెండు వారాలయిన వెనుక నువ్వు కాస్త నావంక కూడా చూడుసుమా. ఏమధ్యాహ్న మొచ్చినా సరే! నీ పెదవులు రుచి చూచిన నాకు ఇంకొకరి ముద్దులు చేదుగా ఉండవా మధుమోహనమూర్తీ!

నీతో సినిమాలో కలసి, నువ్వు నాయకుడుగా కలిసి పనిచేసిన నా అదృష్టమే అదృష్టం. మనం ఇద్దరం నిజంగా నాయికా నాయకులు అయ్యాం గనకనే అంత బాగా నటించగలిగాము.

ఆ రోజులలో నువ్వు ప్రదర్శించిన ప్రేమావేశం గ్రేటా గార్బో ఎదుట నటించిన చార్లెసు బోయెరు ప్రదర్శించగలడా?

ప్రాణనాయకా, నీవు నాకు వరమిచ్చిన ప్రణయం అంతా మీ క్రొత్తభార్యకు ఇచ్చేటప్పుడు, ఈ పాత భార్యను మరువక కొంతైనా నాకోసం ఉంచాలి సమండీ!

ఇట్లు,

"......."

ఈ ఉత్తరం ఎలా చదివిందో చదివింది అనంతలక్ష్మి. రెండో ఉత్తరం చదవలేకపోయింది.

ఆమే తల తిరిగిపోయింది. ఆమే ధైర్యం పూర్తిగా సడలిపోయింది. ఆమె గజగజ వణికిపోయింది. బిగుసుకుపోయింది. ఆమెలోని బలమంతా తూటుపడిన బిందెలో నీరు కారిపోయినట్లయి పోయింది. పదివేల టైఫాయిడ్ల జ్వరము తగలి నెమ్మదించిన నీరస మామెను కప్పింది. ఆమె ఏడ్వలేక పోయింది. ఆమె దేహంలోని రక్తం అంతా పది సంవత్సరాలై ఇంకి పోయినట్లయింది.

ఆ సమయంలో వినాయగంపిళ్ళ “అమ్మిణి! కారు సిద్ధం అయింది. మీ అన్న తొందరపడుతున్నాడు” అని లోనికి వచ్చాడు.

వచ్చీ రావడంతోటే వినాయగానికి అనంతలక్ష్మి అతి నీరసంగా వుందనీ, ఏదో మహత్తరమైన బాధకు ఆమె లోనయిందనీ తోచింది.

“అమ్మిణీ!” అని అతడా బాలిక కడకురికాడు. ఆ అరపులోని అనంతబాధ అనంతలక్ష్మికి అమృతపు మందు నరానికి ఇంజెక్షను ఇచ్చినట్లయింది.