పుట:Konangi by Adavi Bapiraju.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఆంధ్రులను అట్టే అనకు. నా కోసం పెళ్ళి దరఖాస్తులు పెట్టిన వారిలో నూటికి ఎనభైపాళ్ళు వాళ్ళే!”

“అయితే వాళ్ళు ప్రవరాఖ్యులు కారు. వట్టి చలం లు అయి ఉండాలి.”

“ఎవడా చలం?”

“జాగ్రత్త. అతనికి దూరంగా ఉండు. నీమీద ఇన్ని మ్యూజింగులు రాసి పారేస్తాడు. ఇంతకూ నా తండ్రి పోగానే నా చదువు తక్షణం ఆగలేదు. మా అమ్మ దాచుకొన్న డబ్బూ, అవిడకు మా తండ్రి ఇచ్చిన నగలూ చాలా కాలం వచ్చాయి. ఇంటరువరకూ నాకు ఇబ్బందిలేకపోయింది, బి.ఏ. చదువు యమయాతనే అయింది.”

“పాపం!”

“ఏం లాభం? కులంలేక, దిక్కులేక, చుట్టాలులేక, చందాలు, విద్యార్థి వేతనాలతో ఎలా ఆ రెండేళ్ళు పూర్తి చేశానో సీతాదేవీ! ఆ తర్వాత ఇప్పటికీ,బి.ఏ. పట్టా పొందిన ఏడాది నుంచి ఉద్యోగానికి తిరుగుతున్నా! అంతలో మీ తండ్రిగారు 'కావాలి వరుడు, బ్రాహ్మణుడు చాలు. ఎవరైనా బి.ఏ. పై చదువువాడు, పెద్ద ఉద్యోగి, ఇరవై అయిదేళ్ళు మించనివాడు. ధనం కలవాడు చాలు. వధువు పంతొమ్మిదేళ్ళ అందమయిన బాలిక. బి.ఏ. ఆనర్సు మొదటి తరగతి. ఏభైవేల రూపాయల ఆస్తికలది” అన్నది చూచి, వెంటనే ఫొటోతో దరఖాస్తు పెట్టాను. ఇది నా చరిత్ర. నాకో చిన్నయిల్లు తప్ప ఏమీ ఆస్తిలేదు, సీతాదేవీ.”

“లాభంలేదు కోనంగిరావూ! ఎంచేతనంటే నన్ను ఎవరైనా ప్రేమించి నే నాతన్ని ప్రేమించి ఉంటే, నా తలిదండ్రుల ఇష్టంతో నాకు అవసరంలేదు. నేను నన్ను, నేను నిన్నూ పరీక్షగా ఇందాకటి ముద్దులలో ప్రేమిస్తున్నానా లేదా అని చూచాను. నాకు ఎక్కడా మన్మథ బాణాలు తగల లేదు. నిన్ను చూస్తే జాలిపుట్తోంది. అయినా లాభంలేదు.”

అతని హృదయం తేలికైపోయింది. ఆమె చేసుకుంటానంటే, తాను మర్యాదకు, ధర్మానికి, గౌరవానికి, ధనానికి ఒప్పుకు తీరవలసి రావచ్చును! అమ్మయ్య! ఆమెతో ఇల్లు చేరాడు. ఇప్పుడే గుమాస్తా పరీక్ష ఎందుకు? సీతాదేవి తన నిశ్చయం ఇంకా ప్రెస్ కాన్ఫరెన్సులో ప్రచురించలేదు కాబోలు.

4

సీతాదేవి స్వయంగా కారు నడుపుకుంటూ తన్ను రైలుదగ్గిర దిగబెట్టింది. రెండవ తరగతి టిక్కెట్టు కొని ఇచ్చి రైలులో కూర్చోబెట్టి సెలవు పుచ్చుకొని మైలాపురంలో ఉన్న తనింటికి నడిచింది నడిచిందంటే నడిచివెళ్ళిందనికాదు, కారు నడుపుకుంటూ వెళ్ళిందని.

ఆమె వెళ్ళింది. వెంటనే కోనంగి బండిలోంచి దిగాడు. సామాను పట్టుకున్నాడు - సామానంటే తోలుపెట్టె, హెల్టాలున్ను. చరచరా టిక్కట్లమ్మే స్థలందగ్గరకు వచ్చి తనకు రైల్లో ఉండగా అర్జెంటుపని ఒకటి జ్ఞాపకం వచ్చిందని చెప్పుతూ అణాడబ్బులు చెల్లించి, తక్కిన టిక్కెట్టు డబ్బు తీసుకున్నాడు.

ఇక్కడ నుంచి, హస్తసాముద్రికం చూచి ఒక స్నేహితుడు చెప్పిన తన భవిష్యత్తు, నిజం అవడం ప్రారంభించింది. “ఒరే కోనంగీ, నీ శనిరేఖ శుక్ర స్థానంలోంచి బయలు చేరడంచేతనూ, నీ బుధస్థానంలో స్త్రీ రేఖపొడుగ్గా ప్రవహించి శనిస్థానంవరకూ వెళ్ళడముచేతనూ నీహృదయరేఖలో ధనతారలు మూడు ఉండడముచేతనూ, నీకు స్త్రీ