పుట:Konangi by Adavi Bapiraju.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణేశ్వరీ! నువ్వు ధైర్యం వీడని స్థిరవై ఉన్నావా? కరిగిపోయిన కాసారజలంలా ఉన్నావా?

ఆత్మసాయకీ! పక్షిలా ఒంటినై జీవిత విశాలాకాశంలో ఎగిరే నన్ను నీ అందాలతో, అమృతగానాలతో బంధించి నీ ప్రక్కనే చేర్చుకుంటే ఏ పాడుబోదకాలు నన్నీవలలో పట్టి మనల నిద్దరినీ విడదీశాడు?

దగ్గరకు రాలేనంత దగ్గరకు వచ్చిన నిన్ను నేను విడినట్లా ఇంకనూ దగ్గరయినట్లా నా జీవిత పరమావధీ?

“ఈ కటకటాల బొచ్చెడు ఇందుమూర్తి

నీకు నా హృదయార్తిని నిద్రలేమి

తెలివిహీనుడై నిను జేరి తెల్చునంచు

ఇనుమడించిన భయముతో వనటబడుదు”

ఇలా పద్యాలు వ్రాసుకుంటే ఈ గుండెలోని వర్ణనాతీతమైన బాధ తగ్గుతుందా?

“ఎవరయ్యా పూజంటను

ఇటు తెంపిరి అటు తెంపిరి?

ఎవరయ్యా చంద్రుని చంద్రిక

విడదీసిరి విసిరివేసిరి?

ఎవరయ్యా వీణను తీగలు

విదలించిరి విరిచేసిరి?”,

నవమ పథం

ఉత్తరాలు

ఆ సంవత్సరము బి.ఏ. జూనియర్ పరీక్షలో అనంతలక్ష్మి కృతార్థత నందింది. కోనంగి వ్రాసిన ఉత్తరాలు ఆనందంగా చదువుకొంటోంది. ఆ ఉత్తరాలన్నీ పెట్టుకొనేందుకు నాలుగువందల రూపాయలు పెట్టి బంగారం పొదిగిన వెండి పెట్టే కొంది.

కోనంగి జయిలు అధికారుల ద్వారా పంపించే ఉత్తరాలు కాకుండా, రహస్య మార్గాలకూడా ఉత్తరాలు పంపించసాగాడు. అనంతలక్ష్మి భర్తకు రోజురోజుకు ఉత్తరం వ్రాసి, వారం అయ్యేసరికి, అవన్నీ ఒక ఉత్తరంలాగే కలిపి పంపించేది. డాక్టరు రెడ్డి ఇంటికి కొన్ని ఉత్తరాలు పంపితే అవన్నీ ఎలాగో కొన్ని రహస్య మార్గాల ద్వారా జయిలులో కోనంగికి అందేవి.

ఉత్తరం రాగానే కోనంగి, కళ్ళకద్దుకొని, చింపి ఉప్పొంగిపోతూ చదువుకొనేవాడు. విడిపోయిన ఆ యిద్దరూ ఇతరులు చూస్తారన్న సిగ్గును వదలి రిజిష్టరు చేసిన ఉత్తరాలుగా వ్రాసుకొనేవారు. ఒకరికొకరు వ్రాసుకొన్న ఆ ఉత్తరాలలో ఒక్కొక్కప్పుడు వారి ప్రణయజీవిత నిగూఢ రహస్య భావాలు తాండవం చేస్తూండేవి. అడ్డగట్టు వేస్తే, వరదలు వచ్చిన నది కట్టపొర్లి లోకం అంతా ముంచెత్తుతూ, పరవళ్ళెత్తి ప్రవహించిపోయినట్లు వారి ప్రేమ దశదిశలూ నిండుతూ పొంగిపోయింది.