పుట:Konangi by Adavi Bapiraju.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అనంతలక్ష్మి ప్రతిక్షణము తన చుట్టూ పొదివికొని వున్నట్లే తోచింది. "గురువునై నిన్ను ప్రేమించి నీ ప్రేమను చూరగొన్న నేను బిలహణుణ్ణి. నువ్వు యామినీపూర్ణతిలకవు” అని అనిన ఆయన మాటలు ఆమెకు నిమిష నిమిషము సాక్షాత్కారమయ్యాయి!

ఆయన పతితుడా! తాను పతితురాలా? వివాహం ఉత్తమ సంస్థ. ఆత్మసాక్షాత్కార దివ్యమందిరానికి సోపానమార్గం వివాహం. అలాంటి వివాహ సంస్కార విహీనపంకిలంలో ఉద్భవించిన నత్తగుల్ల తానని తన గురువుగారన్నారు. వారే తన ప్రేయసి మాత్రం పతితురాలు కాదని వాదించారు. మధురవాణి పతితురాలెటూ? అని వారి ప్రశ్న. మధురవాణి వంశంలో ఉద్భవించిన తాను మాత్రం ఉత్తమ జన్మ అన్నారు తన గురువుగారు.

తాను, తన భర్తా వివాహంనాడు వధూవరులై తీయించుకొన్న ఛాయా చిత్రాలన్నీ చూస్తూ అనంతలక్ష్మి తన చదువుల గదిలో కూర్చుండి ఆలోచించుకొంటున్నది.

ప్రేమను గురించి తాను ఎన్నో గ్రంథాలు చదివింది. ఇంగ్లీషు కావ్యాలు పఠించి వ్యాసాలు చదివింది. అన్నీ చదివి ఈలా ఉంటుంది ప్రేమ అని ఊహించుకొంది. కాని తన ఊహలకు మించిపోయే ఏదో ఒక దివ్యస్థితిని ఊహించి తన గురువుగారు తమ యిద్దరి వివాహానికి పూర్వం వర్ణించేవారు.

ఒకరోజు తనూ, తన గురువూ ఇద్దరూ కలసి మహాబలిపురం వెళ్ళి సముద్రంలో కలసిపోయే, ఆ విచిత్ర పరమాద్భుత శిల్పపు కట్టడాలలో సముద్రం పరికిస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో ఎంతకాలమో వారిద్దరూ ఆ పరమసౌందర్యానుభూతిలో లయమై మాట లేకుండా ఉండిపోయారు.

కొంటెవారయ్యూ, తన గురువు సౌందర్యోపాసి. తాను వీణ వాయిస్తూ తన గొంతుక ఆ వీణకు శ్రుతి కలిపి, “రామాభిరామా” మొదలయిన కృతులు పాడుతూ ఉంటే, వారు ఉప్పొంగిపోతూ వింటూ, ఆనందాంబువులలో కరిగిపోయేవారు.

ఆనంద మధురమయిన ఇంతే వలపూ బొంపూ లేని నీ గొంతుక సౌందర్య వస్తువులలో కాంచనగంగ, నువ్వు ధవళగిరివి, నీ ప్రేమ గౌరీ శంకర శిఖరము, నిన్ను నా ఆత్మకు పొదివికొన్న నా అదృష్టము నందదేవి” అని వా రా నాడు అన్నారు. “లక్ష్మీ! సౌందర్యవస్తువుల నారాధించడం మనుష్యునిలోని సంస్కారోత్తుంగ కల్లోలకిరీటం. నువ్వు నాకు సన్నిహితం కావడంవల్ల సౌందర్యోపాసన నాకు సులభ లభ్యమయిపోయింది ప్రాణకాంతా!” అన్నారు ఇంకో రోజున.

సౌందర్య వస్తుదర్శనమే వారి హృదయాన్ని సర్వలోకం ఆక్రమింప జేస్తుందట. “ఆ ఆరాధనలో లోకం అంతా ఒక విశ్వసౌందర్యాంతర్భాగమై దర్శనమిస్తుంది. అనంతం! లోకంలో బాధలు, లోకంలో ఉత్తమ పథాలకు పోవాలన్న కాంక్ష, బీదవారి ధనవాంఛ, కూలివారు కోటీశ్వరులతో సమానం అయ్యేందుకు చేసే మహాయజ్ఞం, కాటకాలలోని నాశనం అన్నీ అందులో భాగమై కనబడతాయి. గులాబిపూవు సౌందర్యాన్ని నిజంగా అర్థం చేసుకున్న వారికి పల్లేరుముల్లు అందం తెలుస్తుంది. భైరవిరాగంలో లీనమయిపోగల హృదయం గలవానికే లోకంలో ధనదులచే, జమీందారీ రాక్షసులచే పిప్పి చేయబడే బీదవాళ్ళ ఆక్రందనములోని పరమార్థం అర్థం అవుతుంది. నిర్మల నీలాకాశ మనోజ్ఞతను హృదయమార క్రోలగలవాడే, చావునాచురంగు, కుళ్ళు నల్లరంగు, బాధ బూడిదరంగు పూర్తిగా అర్థం చేసుకుంటాడు. అనంతలక్ష్మి! మహాత్మాగాంధీ వంటి సౌందర్యోపాసి ఇంకోరు లేరుసుమా! ఆయన రాట్నధ్వని బీదతనం లోకంలో ఉండకూడదు అన్న మహానినాదరాగం