పుట:Konangi by Adavi Bapiraju.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని చేతులలో చిన్నబిడ్డలా ఒదిగే ఉన్నది తోటలో ఆమె క్రిందకు దిగినది. అతని నడుంచుట్టూ తన చేయి వేసి, అతని చేతిని తన నడుంచుట్టూ చుట్టగా ఇద్దరూ తోటలో తిరిగినారు. వారలా వెళ్ళడం వినాయగం చూచినాడు. తనలో నవ్వుకొన్నాడు, ఆనందంతో హృదయము నింపుకొన్నాడు.

వారు నెమ్మదిగా అడుగులిడుకుంటూ, వారిరువురూ వెన్నెలలో తాము సాధారణంగా కూర్చునే పొదరింటి పందిరికడకు పోయినారు. అక్కడ బల్లపై కూర్చున్నారు. వారిరువురి హృదయాలు నిండి ఉన్నాయి.

అత డనుకొన్నాడు. మనుష్యునికి ఆకలి వేస్తుంది. ఆకలితో బాధపడతాడు. షడ్రసోపేతమైన భోజనం లభిస్తుంది. అతడు సంతోష స్వాంతుడౌతాడు. మనుష్యుడు బీదతనంతో క్రుంగిపోతాడు. ఇల్లు పోయింది. కట్టగుడ్డలు లేవు. పదిమంది బిడ్డలుగల సంసారము. అంతకన్న అంతకన్న నీచస్థితికి పోతుందా కుటుంబం. అప్పుడాతనికి ఒక్కసారిగా లక్షలు వస్తాయి. అతని ఆనందం ప్రాపంచికానందం. ఈ రెండూ స్త్రీ పురుషుల ప్రేమ కలయికవరము ప్రసాదించే ఆనందంతో సరిపోగలవా? ఇది ఆనందము. అవి అతిశయ సంతోషాలు మాత్రం.

ఆమె అనుకొన్నది. స్త్రీ జన్మకు తన జన్మ అణువు అణువునా లీనమైన పురుషుడే మోక్షం. అతని నుండే ప్రపంచం! అతడు ప్రసాదించే బిడ్డలే ఆ మోక్షంలో భాగాలు. ఓహెూ నాకు ఉత్తమ పురుషుడు భర్త అయినాడు. నేను ఎన్నివేల దేవుళ్ళవలన కోటి కోటి వరాలు ప్రసాదించబడినానో! అని.

ఇరువురూ ఒకరి నొకరు చూచుకున్నారు. ఇరువురూ ఆనందమత్తులైనారు.

దివ్యవరము దివ్యలోకంలో ఉద్భవిస్తుంది. జ్ఞానలోకంలో వినిపిస్తుంది. హృదయ లోకమవతరిస్తుంది. అక్కడ వేగవంతమై బాహ్యలోకం అంతా నిండిపోతుంది.

ఇరువురూ ఆ పుల్కరింపు మైమరపు సమయంలో ఒకరి దేహమొకరు వాంఛించారు! ఇద్దరూ గాఢకామం వాంఛించినారు. రూపం తెల్చిన ప్రేమకు తమ దేహాలను నివేదన లిద్దామనుకున్నారు!

కాని, తమ ప్రేమ దేవాలయం తలుపులు ఇంకను మూయబడి ఉన్నట్లు వారికి తోచింది. ఆ తలుపులకు పెళ్ళి కాకపోవుట అన్న తాళం బంధింపబడి ఉన్నట్లు తోచింది. ఇద్దరూ రోజుతూ ఒకరి కౌగిలి నుండి ఒకరు విడిపోయినారు. సిగ్గు పొందారు. పకపక నవ్వుకొన్నారు. వేడిని జ్యోత్స్నగా మార్చుకొన్నారు.

అష్టమ పథం

కారాగారం

స్వస్తిశ్రీ చాంద్రమాన విక్రమ సంవత్సర ఫాల్గుణ శుద్ద దశమీ బుధవారం రాత్రి పునర్వసుయుక్త కన్యాలగ్నమందు చిరంజీవి కోనంగేశ్వరరావుకును చిరంజీవి సౌభాగ్యవతి అనంతలక్ష్మీదేవికిని వధూ గృహంలో అఖండవైభవముగ వివాహం జరిగింది.