పుట:Konangi by Adavi Bapiraju.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకరోజు సినిమా నుంచి వస్తున్నారు ఆమె కారులో. అనంతలక్ష్మి వెంటనే అతని కౌగలిలో ఒదిగిపోయింది. అతని మోము తన మోముకు గట్టిగా అదుముకుంది. అతని కన్నులు, అతని పెదవులు గాఢచుంబనాలతో ముంచెత్తింది. అతడు పరవశుడైకూడా, వట్టి సాక్షిలా ఆమె చేష్టలు గమనిస్తూ అలా ఊరకున్నాడు.

ఇల్లు వచ్చింది. లోనికి వెళ్ళాడు. “అనంతం! నీకీ మధ్య ఇంత ప్రేమ విజృంభణమైంది. దానికి నేనెంత ప్రశ్నించుకున్నా తోచటంలేదు?” అని ప్రశ్నించాడు.

అనంతం అతని వైపు తేరిపార చూచింది. ఆమె చూపులలో ఏవో తృష్ణలున్నాయి. ఆమె చూపులో ఒక నిమేషంలో దీనత అలము కొన్నది.

“మాష్టరుగారూ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ హృదయంలో ఏమీ దాచకుండా నిజం చెప్పండి, మీరు నాటకాలలో, సినీమాలలో పాలు పుచ్చుకుంటున్నారు. ధనంకోసం కాదు. అని నా కర్థమవుతుంది. ఆ పనులలో మునిగిపోతారు. ఆ సమయాలలో ఒక్కొక్కప్పుడు నన్ను కూడా మరచిపోతారు. నాకు ఏమీ అర్థంకాక భయం కలుగుతూ ఉంటుంది.”

“ఓసి వెట్టి అమ్మాయి, నీకు ఈ అనుమానం ఎందుకు కలగాలి? నువ్వు చదువుకొన్న అమ్మాయివి. నీకు చదువు ఎందుకు అని నేను ప్రశ్నవేయ వచ్చునా?”

“మాకు చదువు పురుషులతోపాటు ఆడవాళ్ళు సమం అవడానికి!”

“పురుషులు ఏమి చేస్తూ ఉంటారు?”

“అన్ని పనులూ.”

“ఆ పనులన్నీ ఆడవారూ చేయాలా?”

“ఆ చేయలేనివి ఒకటి రెండు ఉండవచ్చుగాక.”

“అలాగే స్త్రీలు చేయగలిగిన పనులు మగవారు చేయలేనివి కొన్ని వున్నాయి!”

“అవును.”

“అంతేగాని, అస్తమానమూ స్త్రీపురుషులు ప్రేమ ప్రేమ అని కూచోరుగదా!”

అనంతలక్ష్మి తెల్లబోయి కోనంగి వైపు చూచింది. అతడు చిరునవ్వు నవ్వుతున్నాడు. ఒక్క నిముసం అలా చూచింది. అనంతలక్ష్మి కన్నుల నీరు నిండింది. గబగబ లోనికి పరుగెత్తిపోయి, తన పడకగదికిపోయి, ప్రక్కమీద వ్రాలి వెక్కి ఏడవడం ప్రారంభించింది.

కోనంగి తెల్లబోయాడు. తానేమన్నాడు ఆమెతో? ఆమె కళ్ళలో నీరు నిండిందే! ఆ దివ్యసుందరగాత్ర హృదయంలో ఏ బాధ చేరింది? ఆ అమలహృదయ మనస్సులో ఏ అనుమానం మొలకెత్తింది?

అతడు నెమ్మదిగా ఆమె గదిలోకి వెళ్ళినాడు. ఆమె పరుపుపై బోర్లగిల పడుకొని దిండులో తలదూర్చి సముద్రమై కరిగిపోతున్నది.

15

“ఈలా చూడు లక్ష్మీ!” కోనంగి అనంతలక్ష్మిపై వ్రాలి, ఆమెను పొదివిపట్టుకొని, తనవైపు తిప్పుకొని, ఆమె చెవిలో “నువ్వు నాకు రాజరాజేశ్వరివి. నువ్వు నాకు ఆత్మవు. ఎందుకీ దుఃఖం? ఏమిటీ ఆవేదన? నువ్వు ఆజ్ఞ ఇయ్యి. అగ్నిపర్వతంలో ఉరుకుతాను. నువ్వు నాకు చక్రవర్తినివి! నాకు నీ పైన ప్రేమ ఎంతవుందో దాని అనంతత్వము నాకు మాత్రం తెలుసునా లక్ష్మీ?”