పుట:Konangi by Adavi Bapiraju.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాత్కాలిక బసలో చేరారు. కొందరు దారి దౌర్భాగ్యులకు సహాయం చేస్తున్నారు. కొందరు హేళన చేస్తున్నారు. కొందరు ఎవ్వరితోనూ మాట్లాడక తమ దారిన తాము పోతున్నారు. కొందరు ఆగి కూర్చుండి తమ చుట్టూ రక్షణకై గోడలు కట్టుకుంటున్నారు.

ఎంత విచిత్రమైనదీ దృశ్యం. ఈ మహాదృశ్యం, ఈ బ్రహ్మాండదృశ్యం అంతా చూడగలిగినవారు మహాపురుషులు. అదే ఎయన్ స్టెయిను భావం. ఆదే శ్రీకృష్ణ భావం. అదే కారల్ మార్క్స్ భావం. అదే మహాత్మాజీ భావం.

ఇందులో ఎవరు ఈ ప్రపంచ ప్రళయాలు సృష్టించేవారు? వాని అర్థం ఏమిటి? అని కోనంగి డాక్టర్ని ప్రశ్న వేశాడు.

“ఓయి వెర్రివాడా! ఒక మనుష్యునిలో ఒక పెద్దజబ్బు ప్రవేశిస్తే అది ఎన్నో రూపాలుగా పైకి వస్తుంది. సామ్రాజ్యవాదం అనే జబ్బు లోకంలోకి వచ్చింది. ఇది పదిహేడవ శతాబ్దంలో విజృంభింపసాగి, ఇప్పటికీ లోకాన్ని బాధపెడుతూంది. ఆ జబ్బు యొక్క వెర్రితలలు ఫాసిజం, నాజీజమూను!”

“సామ్యవాదంలో లోట్లులేవా?”

“ఉండవచ్చును. అవి ఒక్కొక్క దేశంలో ఆ వాదం వేళ్ళు పాదుకోవడంలో వచ్చిన లోట్లు.”

“ఆ లోట్లు ఎల్లా పోతాయి? లేకపోతే అవి పోనేపోవా?”

“కొన్ని పోవచ్చును. కాని ఎప్పటికీ పోకపోవచ్చును.”

“డాక్టరులా మాట్లాడావు?”

“నేను డాక్టరు నయినప్పుడు ఇంక ఎల్లా మాట్లాడుతాను?”

“కొందరు డాక్టర్లు కూడా మామూలుగా మాట్లాడబోతారు.”

“కొందరు మామూలు వాళ్ళు డాక్టర్లుగా మాట్లాడబోతారు.”

“కాని డాక్టరు డాక్టరుగా మాట్లాడడం అన్నింటిలో పనికి వస్తుందా నాయనా?”

14

అనంతలక్ష్మి త్వరలో వివాహం కావాలని తల్లితో నిర్మొహమాటంగా చెప్పింది.

“ఆదేమిటే అమ్మిణీ! అవతల భూమి అంతా వ్యాజ్యంలో పడింది. ఇప్పుడే ఈ గొడవ అంతా ఎందుకు?”

“ఎప్పుడూ వారితో కలిసి మెలసి ఉంటూ వారి దగ్గర ఉన్నప్పుడు తదితర లోకం అంతా మరిచిపోయే నన్ను...”

“ఎంతకాలం ఈలా దూరంగా ఉండాలంటావు? అని నీ ప్రశ్న? నీ చదువన్నా వూర్తి అవ్వాలా?”

“అయితే అవుతుంది, లేకపోతేలేదు, చదువుకీ...”

“చదువుకీ పెళ్ళీకీ సంబంధం లేదంటావు.”

“స్నేహితురాండ్రందరూ వేళాకోళంచేసి చంపేస్తున్నారు.”

“పెళ్ళి అయిన తర్వాత మాత్రం వేళాకోళం చేయరా?”

“చేయరమ్మా, పెళ్ళి అయిన వారి మాట అలా ఉంచు. మా కాలేజీలో పిల్లల తల్లులయిన వాళ్ళెందరో ఉన్నారు. పెళ్ళయినవారి జోలికి వెళ్ళకూడదని మా కాలేజీలో నియమం ఉంది.”