పుట:Konangi by Adavi Bapiraju.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమ్మాయి: చాలా బాగుంది, డ్యాడీ! నేను కాలేజీకి వెడుతున్నాను. అసలు వెళ్ళకపోదును కాని, క్లాసుకు మొదటిదాన్ని అవడంచేతా, అందరికీ తల్లో నాలికవంటిదాన్ని అవడంచేతా, నేను లేకపోతే తరగతి అంతా చిన్నబోతుంది. డ్యాడీ! ఈ భవిష్యత్తువరుడు బాగానే ఉన్నాడు. నాకు నచ్చితే ఇంగ్లండు తీసుకుపోతానుకూడా! హల్లో! అందరికి వందనాలు. వెడుతున్నా. ఓ నూత్నవరుడుగారూ! మీరు మాఇల్లే మీఇల్లనుకోండి. అన్ని సౌకర్యాలు పనికత్తె రామ్ చూస్తుంది. సెలవు.

ఆ అమ్మాయి గబగబా కారుదగ్గరకు వెళ్ళిపోయింది. లావుపాటి భవిష్యత్తు వధువు తండ్రీ, సన్నపాటి పెద్దమనిషీ ఇద్దరూ లేచి వంటవాడు, పనిమనిషి, బోయీ మీకు సమస్త సదుపాయాలూ చేస్తారు. త్వరలోనే వస్తాము” అని చెప్పి పోర్చిలో సిద్దంగావున్న వేరొక కారెక్కి చక్కా పోయారు.

కోనంగి అలా దిగ్భ్రమపడి ఆ చక్కని ఒకటన్ను గులాబిపూవుల ప్రోవులాంటి పెళ్ళికూతురును తలచుకొంటూ, “ఓహెూ! ఏమి అందం!” అని అనుకొన్నాడు. తాను 'హిందూ'లో చూచిన ఎడ్వర్టయిజిమెంటు ప్రకారం “ఈ బాలిక బంగారపు పిచ్చిక! విధవ అయితేనేమి? ధనం మూలుగుతూంది. ఆ అమ్మాయి నడిచిన భూమే బంగారపుముద్ద అవుతుంది.ఆ అమ్మాయి పాదాల్లో, చేతులో, చూపుల్లో పరసువేది ఉంది తప్పకుండా! కాని అందం మాటా? అది దృక్పథాన్నిబట్టి ఉంటుంది” అనుకున్నాడు.

ఆ విషయంలో తన దృక్పథం కొంచెం వ్యతిరేకంగా ఉంటున్న దేమిటో మరి. మనస్సు కొంచెం ముడుచుకుపోయింది. తన ధైర్యం వేసం కాలంలో నీళ్ళులేక ఎండిన వాగులా అయిపోయింది.ఎండగట్టిన కృష్ణ కాలవలా తయారై ఊరుకుంది.

గిరీశం లాభనష్టాలు బేరీజు వేసుకొన్నాడు. అలాటి తెలివితక్కువ పని తాను చేయదలచుకోలేదు. చలంలా ఇన్ని మ్యూజింగులు చేయదలచు కోలేదు. తాను ఒక కానో ఓ రూపాయో ఎగరవేసి చూడ్డం మంచిది. లేదా చీటీలు ఏలాగా ఎగురవేయవచ్చును. లేకపోతే పెళ్ళికూతుర్నే "అవునూ, కాదూ” వేళ్ళు పట్టుకోమంటే?

ఈ ఆలోచనకు నైజాంబోయీ అడ్డంవచ్చి “దొరా! లే స్నానానికి రండ్రీ” అన్నాడు. ఆ బోయే కోనంగిని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు.

2

ఆ ఆమ్మాయి సీతాదేవి సాయంకాలం వచ్చింది. రాగానే “హల్లో! మీ పేరు కోనంగిరావు కాదూ! అయితే కోనంగిరావుజీ, ఇదిగో దుస్తులు మార్చుకొని వస్తున్నాను. మనం ఇద్దరం టీ పుచ్చుకుందాము. నీకు కాఫీ యిష్టమా, టీ ఆ? కొంపదీసి కోకో కాదు గదా? టీ అవగానే న్యూగ్లోబు సినిమా చూడ్డం మన కార్యక్రమం ఆ తర్వాత బీచీ, పది గంటలకు ఇంటికి, పదిన్నరకు భోజనం” అని గబగబ కోకిలలా, చిలకలా, గ్రామఫోనులా, రేడియోలా, సినీమాస్టారులా పలికి, లోనికి పరుగెత్తింది. ఆ వరాలమూట, ఆ వజ్రాలపోగు, ఆ రసగుల్లాల పళ్ళెం "నువ్వూ దుస్తులు మార్చుకో" అంటూ పరుగున పెద్ద మలయమైన గాలివానలా తేలిపోయింది.

అయిదు గంటలకే వచ్చింది. అరగంట సేపు అలంకరించుకొంది. అలంకారం అంతా అయి టీ గదిలో కూర్చుని కోనంగికి కబురు పంపింది.

కోనంగి (నవల)

3