పుట:Konangi by Adavi Bapiraju.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచ్యదేశాలలో మహరులు అహింసావాదాన్ని, హింసాపూరితమైన వస్తువులను, భావాలను వదలివేయడంలో చూపించారు. కాని ప్రపంచాన్ని ఎదుర్కొని ప్రపంచంతో భాగస్టులై అహింసను ఆచరించేది ఒక్క బాపూజీయే.

రష్యావారు అహింసావాదాన్ని హింసతో నెలకొల్పుతున్నారు. ఆ ప్రయత్నంలోనే వున్నారు.

ఆశయానికి వెళ్ళడం ఆశయ స్వరూపమైన దారినా? లేక ఏదారినైనా సరేనా?

ఇదీ కోనంగికి తగిలిన పెద్ద సమస్య. గాంధీమహాత్ముని గురించిన గ్రంథాలు చదువుతోంటే అహింసా మార్గమంత ఉత్తమమైన మార్గం లేదనుకుంటాడు. తన స్నేహితుడు డాక్టరుగారు చదవమని యిచ్చిన గ్రంథాలు చదువుతోంటే రష్యామార్గమంత ఉత్తమమార్గ మింకోటి లేదనుకుంటాడు.

జర్మనీ వాళ్ళే దేశాలన్నిటికీ రక్ష అనుకుంటాడు మెయిన్ కాంప్ చదువుతూ. కాని వెంటనే నాజీఇజం - సామ్రాజ్యవాద, సామ్రాజ్యవాద సంఘర్షణ జనితమైన పాశ్చాత్య యాదవకుల ముసలం అని అనుకుంటాడు.

లోకంలో వున్న అన్ని ఆవేదనలకూ, బాధలకూ, కష్టాలకూ, బీదతనానికీ, చలికీ, ఆకలికీ, ఎండిపోయే వాంఛలకూ, అఖండ నిస్పృహకూ ఏడుగడ రష్యావారి సామ్యవాదమే అని అనుకుంటాడు. పాశ్చాత్యుల ప్రజా ప్రభుత్వవాదం (డెమోక్రసీ) చెప్పినట్లు వ్యక్తి స్వాతంత్ర్యమే ప్రపంచ రక్షేమో, అది సామ్యవాదమా అని అనుమానిస్తాడు.

ఇంగ్లండులోని ప్రజాపాలన విధానంగాని అమెరికాలోని ప్రజాస్వామ్య విధానంగాని, ఫ్రాంసు వగైరాలలోని ప్రజారాజ్య విధానాలు గాని ఆ యా దేశాలకు ఏమి శాంతి చేకూర్చాయి? అని ప్రశ్నించుకుంటాడు.

అనంతలక్ష్మి ఇంటరు మొదటతరగతిలో కృతార్థురాలైంది. ఇంగ్లీషులో, తెలుగులో యూనివర్శిటీ కంతకూ మొదటిగా రావడంవల్ల రెండు బంగారు పతకాలు బహుమానాలు అందుకుంది.

కోనంగి తన్ను తయారుచేసిన విధానంవల్ల అనంతలక్ష్మికి బహుమానాలు వచ్చాయి. పాఠాలన్నీ అద్భుతంగా బోధించడమే కాకుండా, పరీక్షల ముందు బాగా పరిశీలనచేసి ఈ ప్రశ్నలు వచ్చి తీరుతాయి అని, ప్రశ్న పత్రాలు తయారుచేసి వానికి చక్కని జవాబులు వ్రాయించి తన్ను అద్భుతంగా సిద్ధంచేశారు.

నూటికి ఎనభైవంతులు అతను వస్తాయని అంచనా వేసిన ప్రశ్నలే వచ్చాయి. తక్కినవి ఆమెకు వచ్చును.

పరీక్షలు తెలిసినరోజున కోనంగి సినిమా తయారులో నిమగ్నుడై ఉన్నాడు. యూనివర్సిటీ నుంచి వెంటనే కోనంగి అభినయించే స్టూడియోకు కారుపై వెళ్ళింది అనంతం.

కోనంగి వేషంమీద ఉన్నాడు. సెట్టుమీద అభినయం పూర్తికాగానే అనంతలక్ష్మిని కలుసుకుని “మొదటి తరగతి, రెండవ తరగతా?” అని అడిగాడు.

“మొదటి తరగతి గురువుగారూ! నాకు ఇంగ్లీషులో, తెలుగులో విశ్వవిద్యాలయాని కంతకూ మొదటి బహుమానం!”

“అసి పిల్లా కొట్టావూ! నీకు నా గాఢ అభినందనాలు. నువ్వు ఇంటి దగ్గర ఉండు. నావంతు ఒక అరగంటలో పూర్తిచేసుకొని, తక్కినవి రాత్రికి ఏర్పాటు చేసుకొని మీ ఇంటికివచ్చి వాలుతా! మనం సినిమా, టీ పార్టీ, సముద్రం షికారు, మీ ఇంటి దగ్గర విందూ, నేను నీకు అద్భుతమైన బహుమతిన్నీ!”