పుట:Konangi by Adavi Bapiraju.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనబడడం దృశ్యం. వెళ్ళి కనిపెట్టుకొని ఉండగా, ఉండగా కనబడడం ప్రత్యక్షం. 'త్యక్షం' అంటే వెళ్ళిన అయిదు నిముషాలకే కనబడడం. 'క్షం' అంటే చూడడానికి వెడదామని అనుకొంటేనే తన ఇంటికి ఆ పెద్దమనిషి రావడం.

'దరిసెనం' అనే మాటకు చూడటానికి వెళ్ళిన పెద్దమనిషి వీపు మాత్రం కనబడటం!

కోనంగి తాను సలుపవలసిన మర్యాదలు నిర్వర్తిస్తున్నాడు. ఒకటి, హాలు డాబా సరంబీవంక చూచాడు. రెండు, హాలంతా కలియచూచాడు. మూడు, గుమ్మాలవంక చూచాడు. నాలుగు, ఒకసారిలేచి హాలు యావత్తూ కలియతిరిగాడు.

ఇంతట్లో లోననుండి ఒక లావుపాటి సూటు వేసుకొని తలపాగాచుట్టుకొన్న మనిషీ, సన్నగా పొడుగ్గా పోకచెట్టులా ఉండి పంచె, కోటు, తలపాగా, మడతల జరీ సేలంకండువా వేసుకొన్న మనిషి లోనకు వచ్చారు.

ఇద్దరు పెద్దలు రాగానే కోనంగిరావు నిలుచున్నాడు. వారికి నమస్కారం చేశాడు. తానే వారిద్దరినీ అయా పీఠాలపై కూర్చోండని మర్యాదగా రెండు చేతులూ జోడించి చూపినాడు.

కోనంగి చూపులో, వారిద్దరూ కోనంగి ఇంటికి దయచేసిన ఎవరో ఇద్దరు పెద్దల్ని చూచిన చూపులు.

లావుపాటి ఆయన: ఓహెూ మీరు దయచేసినారా! (ఇంగ్లీషులోనే ప్రశ్న తరువాత ఇంగ్లీషే!) ఇవాళ మెయిలు ఆలస్యము కాబోలు! కనిపెట్టుకొని ఉండి భోజనం చేశాను. క్షమించండి. ఆఫీసు టైము.

సన్నపాటి ఆయన: వీరేనా భవిష్యత్తు వరుడు? (ఈయనా ఇంగ్లీషు భాషలోనే!) అయితే తమ పేరు?

కోనంగి: (ఇంగ్లీషులోనే) నా పేరు కోనంగేశ్వరరావు. స్నేహితులు కోనంగి అని పిలుస్తారు. కొందరు కోనంగిరావు అంటారు.

లావు: వీరు బి.ఏ. మొదటి తరగతిలో ప్యాస్ అయినారు. మంచి ఆస్థిపరులు.

కోనంగి: అబ్బెబ్బే, ఆస్థి ఏమీలేదండి.

సన్న: మీ మర్యాదమాటల కేమిలెండి! మీ గ్రామం?

కోనంగి: మాది బందరు.

లావు: ఆమ్మాయి కాలేజీకి వెళ్ళబోతూ ఉన్నది. ఇప్పుడే వస్తుంది. (ఈయన మాట్లాడినప్పుడల్లా స్నేహితునివైపు, నేను చెప్పేది నిజమేకదూ అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. అలా చూసినప్పుడల్లా ఆయన అవునుకదా మరి! అన్నట్టుగా తల ఊపుతాడు.)

ఇంతట్లో ఆ ఇంట్లోనుంచి, నూటయాభై రూపాయల ఖరీదుగల బెనారసు జరీపూవుల నూరోనెంబరు ఆరుగజాల నూలు చీర ధరించి, చిన్నఐరావతం వంటిదిన్నీ, తెల్లని పళ్ళెత్తుగలిగినదిన్నీ బాలిక ఒకతె రెండు జడలతో, ఎత్తుమడమల జోళ్ళతో చక్కా వచ్చింది. ఆమె ఇంగ్లీషు భాషలోనే, “డ్యాడీ, వరుడు వచ్చాడనుకొంటా, ఈయనేనా?” అని ప్రశ్నించింది. ఆ అమ్మాయి పై పళ్ళు నాలుగు బాగా ఎత్తుగా ముప్పదిడిగ్రీలు ముందుకువచ్చి క్రింది పెదవిని కప్పుతూ పై పెదవిని ముక్కుకంటిస్తూ ఉన్నాయి.

లావు: అవును సీతా! అవును. ఆయనే భవిష్యత్తు వరుడు. ఈయన ఇక్కడే ఉంటాడు. నువ్వు త్వరగా కాలేజీ నుంచి వచ్చి ఈయనతో మాట్లాడుతూ ఉండు. నేనూ మీ మామా ఇద్దరం కలిసివస్తాము.