పుట:Konangi by Adavi Bapiraju.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నన్నంత ప్రేమించినదానవు, ప్రేమ అంటే ఏమిటో ఎరగని ఒక నికృష్టజీవికి ప్రేమదానమిచ్చిన దివ్యదేవివి! ఇప్పుడు నీకంత కష్టమేమిటి?” ఆమె మాట్లాడలేదు.

“నువ్వు చేసినపని ఏనాటికీ తప్పుకాదు. ముసల్మానులకు భయపడి పుట్టిన నియమాలన్నీ పూర్వకాలంనాటి వనుకుంటున్నావు. భర్తపోయిన అంబికా అంబాలికా వేదవ్యాసునితో సంగమించి కొడుకులను కన్నారు. వారికిలేని తప్పు నీకు వచ్చిందా?”

ఆమె మరీ మౌనం వహించింది. కోనంగి అసలు తండ్రి లోనికి చొచ్చుకొనిపోయి, ఆమెను బిగియార కౌగలించుకొన్నాడు. అతనికి ఆమె విగతకేశినిలా కనబడనేలేదు. అతని ముద్దులు కల్లబొమ్మ పెదవులపై పడ్డాయి కాని, ఆమెకు కొంచేమన్నా స్పందనం కలిగించలేకపోయాయి. ఆడవాళ్ళ హృదయం పరమాత్మునికి కూడా తెలియదనుకుంటూ అతడామేను మళ్ళీ తనకు ని చేసుకొనే ప్రయత్నం తగ్గించాడు. ఆ మానడం ఒక్కసారిగా తగ్గించలేదు. నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది.

ఎప్పుడైనా వచ్చి అతడు ఆమె పక్కలో పండుకొని, వేయివిధాల బ్రతిమాలినా ఆమె రాతిబొమ్మ అయిపోయి లోకం కరిగిపోయినట్లు కళ్ళ నీళ్ళుకార దుఃఖించేది. మహాత్ముని శిష్యురాలిలా ఆమె ఇతర అల్లరి ఏమీ చేయకుండా సత్యాగ్రహం చేసేది.

కోనంగి తల్లిపైన ఆ తండ్రికున్న ప్రేమ అంతా కొమరుని పైన మహాప్రేమతో కలిపి కోనంగిపై నే అఖండవర్షం కురిపించేది!

తన్ను కౌగలించుకున్నప్పుడు తనదేహం అతడు ముద్దెట్టుకున్నప్పుడు ఆమె వెంటనే ఆవుపేడ నీళ్ళలోకలిపి స్నానంచేసేది. ఇన్ని ఆ నీళ్ళే త్రాగేది. భగవంతుని ప్రార్థించేది, రోదించేది.

కోనంగి తండ్రి కూడా కొంచెం పాపభీతి కలవాడు కాబట్టి, కొంతమేరకు సాగి ఆమెను రెండవసారి కామవాంఛాతృప్తికి దింపలేకపోయేవాడు.

అతడు ఒకసారి తన్ను పెంచడంవల్ల అతడు తన కొక విధంగా భర్త అని ఆమె అనుకోక పోలేదు అతడు తనలోని గాఢవాంఛతో ఆమెను నలిపివేస్తున్నప్పుడు ఆమెకు తెలియకే ఆమెలోని స్త్రీత్వ నరపుముడులు సడలుకొని కొంచెం కరిగేది గాని, ఆమెలోని పాపభీతి ఆ కరగుటను గమనింపజేయక ఆమెను వట్టి చైతన్యరహితురాలినిగా మాత్రం చేసేది. అంతటితో కోనంగి తండ్రి ఆగిపోయేవాడు.

తన గతి ఇంతేనని, భగవంతుడు ఉత్త కామపురుషుడయిన తనకు ఈలాంటి శిక్ష నిచ్చాడనీ అతడు రోదించేవాడు. ఇవన్నీ కొమారునికి ఒక ఉత్తరం వ్రాసి అతడు పరలోకగతుడయ్యాడు. కోనంగి తండ్రి పోవడం తన అదృష్టమనీ, తన ప్రార్థన భగవంతుడు వినడంవల్లననీ ఆమె అనుకునేది. ఒక ప్రక్క స్త్రీత్వ మేమీలేని రాక్షసి తన భార్యయట. తాను ప్రేమించిన స్త్రీకి విపరీత పాపభీతియట. ఇవన్నీ తన ప్రియపుత్రునికి రాయడానికి కారణం ముందు ముందీ విషయాలనుగూర్చి విచారించి పరిశోధించి ఆ బాలకుని జీవితము ఉత్తమపథంలో నడిపించుకొనడానికేనట!

“బాబూ! మనుష్యుడు కర్మజంతువు. అతడుగాని ఆమెగాని (ముఖ్యంగా పురుషుడు) సర్వకాలమూ పనిలో నిమగ్నుడై ఉండాలి. ఈ కర్మకు పునాది స్త్రీకి పురుషుడు, పురుషునకు స్త్రీ. స్త్రీవాంఛలో పురుషు డే కార్యమూ సాధించలేడు. అలాగే స్త్రీయున్నూ. ఎంత ఉత్తమ కార్యం తలపెట్టినా అంతే. మనం మహాత్మాగాంధీలము కాము కాబట్టి, నాయనా! ప్రేమ అనే వస్తువు వుంది. దాన్ని ఏడిపించక వీధులూడ్చే దానిమీద ప్రేమ కలిగితే, (వట్టి పశు కోనంగి