పుట:Konangi by Adavi Bapiraju.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి

• సాంఘిక నవల •

ప్రథమ పథం

ఉద్యోగ ప్రయత్నం

సర్రున కారువచ్చి ఆగింది. కారులోంచి కోనంగి దిగాడు. దిగీదిగడంతోటే కారు డైవరుకు కుడివైపున ఉన్న అద్దంలో ఎందుకైనా మంచిదని తన్నుచూచుకొంటూ కోటుమడతలు సరిచేసుకొన్నాడు. టై సర్దుకున్నాడు. చేతికర్ర వయ్యారంగా పట్టుకొని ఒకమాటు తల ఇటూ, ఓమాటు తల అటూ తిప్పుకొని, 'దిగ్విజయీభవ!' అని మనస్సులో అనుకొని ఈ విజయదశమికి తనకు విజయం తప్పదనుకొంటూ, జాగ్రత్తగా కుడికాలు జాపి దూరముగా ఉన్న మొదటిమెట్టుపై వేలువైచి పడబోయినంతపని అయి కర్రతో ఆపుకొని, పదిసెకండులు మెట్టుమీదే ఆగి, రెండవదిమెట్టు, మూడవ మెట్టు, నాల్గవ అయిదవ మెట్టులు కుడిపాదం వేస్తూనే ఎక్కి ఆ భవనం ముందర వరండాలో ఆగాడు. ఆగినాడంటే మామూలుగా ఆగినాడా?

ఒక మహారాజు కొమరుడు వేరొక మహారాజు ఇంటికి వచ్చినట్లే! ఆ వచ్చినకారు తనదే అయినట్లు! ఏమో, ఈ సంబంధమే కుదిరితే ఈ కారు తనది ఎందుకు కాకూడదూ?

అదృష్టం పెళ్ళివల్ల పట్టాలి! బంగారపు పాదాలతో పెళ్ళికూతురు పెళ్ళి కొమరుని దగ్గరకు నడచివచ్చిందనుకోండి; అప్పుడు లక్ష్మి నీ దగ్గరకు వచ్చినట్లే కాదటయ్యా! నీ మామగారు వట్టి పాలసముద్రుడా? ఇంగ్లీషు ఆయిషైరు ఆవుపాల సముద్రుడుగాని!

కుదిరితే ధనంవున్న పెళ్ళికూతురే కుదరాలి; అయితే ఐ. సి. ఎస్. ఉద్యోగమే ఆవ్వాలి, అని కోనంగి దృఢనమ్మకం.

ఇంతలో కోనంగిరావుగారి దగ్గరకు ఒక చప్రాసీ పరుగెత్తుకొనివచ్చి, వంగి నమస్కారాలు చేసి లోనికి దయచేయండని అక్కడవున్న ఒక సోఫాపై అధివసింప సంస్కృత భాషలో కోరినంతపని చేశాడు. 'ఆ సోఫాత్తిల్లె అదిగసిప్పుడు సామీ' అని.

ఆ చప్రాసీ ఉత్తర మలబారుజిల్లా మనిషి, యజమాని హెబ్బారు అయ్యంగారు, వచ్చిన కోనంగి తెలుగువాడు. కారుడైవరు తిరునల్వేలి జిల్లా పోడు.

“ఇదర్ వా అప్పా. ఈ సామానుదా తీయ్, క్విక్?” అని డైవరు చప్రాసిని కేక వేసినాడు.

యజమానిగాని, కాబోయే పెళ్ళికూతురుగాని, ఆమె చెలికత్తెలుగాని, ఆయన ప్రాణ స్నేహితులుగాని, మరి ఏ యితర పెద్దమనుష్యులుగాని, కోనంగికి ఆ హాలులో, ఆ గుమ్మాలలో, ఆ గోడలమీద, ఆ మేడ పై కప్పుపై దృశ్యం కాలేదు. ఆఖరికి ప్రత్యక్షమన్నా కాలేదు. కోనంగి భాషలో ఈ రెంటికి తేడా ఉండదని కాలేజీలోనే వాదించేవారు. వెళ్ళగానే

కోనంగి (నవల)

1