పుట:Konangi by Adavi Bapiraju.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె అతన్ని గాఢంగా వాంఛించింది. ఆమె అభినయంలో, మాటలలో ఆ గాఢతా, ఆ వాంఛా వ్యక్తమౌతూ ఉంది. కాని కోనంగి అంటీ అంటనట్టున్నాడు. అతని అభినయం కూడా ముభావంగానూ, త్రపాపూరితంగానూ ఉంది.

ఇదంతా డాక్టరు రెడ్డిగారు చూస్తున్నారు. అయినంతమట్టుకు యెలావుందో చూచుకుంటే కథానాయకుడు సిగ్గుపడుతున్నట్లు, అతనికి ప్రేమకన్న మర్యాద ఎక్కువగా ఉన్నట్లు కనబడింది.

డాక్టరుగారు కోనంగితో చాలాసేపు తమ ఇంటిలో వాదించారు. ప్రేమ అనే ఒక దివ్యభావం ఉందంటే నేను ఒప్పుకోను కోనంగ్! కాని స్త్రీ పురుషుల మధ్య నుండే భావం పశుభావం కాదని నువ్వు వాదించావే, ఆ వాదనంతా నీ అభినయంలో ఏమైపోయింది?” అని ప్రశ్నించాడు.

కోనంగి: ఆమె వేశ్యవృత్తిలోవున్న బాలిక కాదయ్యా మరి!

డాక్టరు: అయితే నిన్ను ఎత్తుకుపోయిందా? కోనంగి: కాని బజారు వస్తువు అని తెలియడంవల్ల నాకు జుగుప్స.

డాక్టరు: ఆ బజారుతనం నీకు కూడ వస్తుందనా? కోనంగి: కాదు.

డాక్టరు: కాదూలేదు, గీదూలేదు! అభినయం నిజం అనుకుంటున్నావా?

కోనంగి: అనుకోటంలేదు. నిజంలో నుంచి ఇంకా అభినయంలోకి దిగలేకుండా ఉన్నాను.

డాక్టరు: అయితే బొమ్మంతా తగలడిపోతుంది.

కోనంగి: ఎట్లాగ?

డాక్టరు: ఆ అమ్మాయి ఎంత చక్కగా అభినయిస్తోంది. నీ మీద కన్ను వేసిందనుకుంటాను.

కోనంగి: అందుకనే అంత బాగా అభినయిస్తోంది.

డాక్టరు: బడాయి కూడానా! కాని నువ్వు నీరాణీని అనంతలక్ష్మిని తలచుకో!

కోనంగి: ఛా! ఛా! మా ప్రేమ పవిత్రమైంది.

డాక్టరు: ఏమిటా పవిత్రత? పవిత్రం ఏమిటి, అపవిత్రం ఏమిటి?

కోనంగి: బాబూ! ఆ విషయాలు ఇంకోసారి వాదించుకుందాములే! నన్ను కోపంచేయకు తండ్రీ!

డాక్టరు: కోపమా, కోపమన్నరా? ఇంత డబ్బు పెట్టి తీస్తున్న చిత్రమూ, నీ అభినయంవల్ల తగలబడవలసిందేనా? ఎప్పుడూ నిజం అనుకునేటట్లు అభినయిస్తావే! జీవితంలో అభినయమూ నాటకంలో జీవితమూనా నీ వ్యాపారం? రాఘవాచారిగారిని చూడు. ఆయన చెప్పిన విషయాలు మరిచిపోయావూ?

9

కోనంగి తన ప్రేమాభినయంలో లోటు వుందని గ్రహించాడు. కారణం, తనలోని భయం. ఆ భయం ఎందుకు కలగాలి? నాయిక పాత్ర వేసే అమ్మాయిని తన హృదయం మెచ్చుకొంది. ఆమెను స్త్రీగా తాను వాంఛింపలేదు, నిజమే. కాని ఫ్రాయిడ్ అన్నట్లు తన హృదయాంతరము ఆ బాలికను తన స్త్రీగా చూడటం ప్రారంభించింది. హృదయమూ, మనస్సూ ఆ వాంఛను అసహ్యించుకుంటున్నాయి. తాను సంపూర్ణ హృదయంతో