పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

3


కొని నిర్వృతి పదంబునకుఁ జల్లగ నెగిరిపోవును. మొగము మొత్తినట్లు, కన్నులు మిటారించుకొని మమ్ములను గనుఁ గొనుచున్న ప్రాపంచిక యధార్ద్యము, మెల్ల మెల్లగ సమసిపోయి యనిర్వచనీయమగు నానంద స్వప్నము అవతరించును! ఓయి, నీ కలము సోఁకిన ప్రతివిషయము, ప్రతిపదము, ప్రతిభావము, ప్రతిరూపము శాశ్వతమై యమృతమై యొప్పారును! ఒక్క నిమిష మనంత కాల స్వరూపముగఁ గన్పట్టును. భూమి స్వర్గముగఁ బరిణమించును. ఓ కవీ, మానవ జీవితమును ఆనందమఖముగ నొనరింపుము.

__________

2. కవిత్వావతరణము

"ఋషే, ప్రబుద్దో౽సి వాగాత్మని
తత్ బ్రూహిరామచరితం
అవ్యాహతజ్యోతిరార్షం
తే చక్షుః, ప్రతిభాతి; అద్యఃకవి రసి”

“నీవు మొదటికవివి” అని బ్రహ్మ వాల్మీకి మహర్షితో జెప్పినటుల రామాయణమునఁ గూర్పఁబడియున్నది. అందువలన వాల్మీకి యాదికవియనియు రామాయణ మాది కావ్యమనియుఁ గాలక్రమముగఁ బ్రజలు విశ్వసించుచువచ్చిరి. నేఁటికిని విశ్వసించుచున్నారు. బోయచేఁ గూల్పఁబడిన క్రౌంచమును గాంచినప్పుడు వాల్మీకికిఁ గలిగిన శోకావేశమే ప్రథమ కవిత్వావతరణమని లోకప్రసిద్ది. కానీ, నేను వేఱుగఁ దలంచెదను. క్రౌంచ మిధునగాధ వాల్మీకి కవియైన విషయమును