పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మకవిత్వము

83


సంతానములారా' యని సంబోధించినాఁడు. ఎంత ప్రేమ ! ఎంతయానందము ! ఎంతసత్యము ! తాను దర్శించిన తేజస్సు అప్రాకృతము. కావున నది వర్ణింపనలవిగానిది. సామ్యముచే మాత్రము నూహింపసాధ్యమైనది. అదియు విలోమమార్గమున-

“నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం
 నేనూ విద్యుతో బాంతి కుతో౽య మగ్ని:
 తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాపా
 సర్వ మిదం విభాతి."

ఆత్మానుభవజన్యమైన యిట్టి యపూర్వసత్యములను వైదిక ఋషులు వర్షించిరి. వారు ఆధ్యాత్మిక కవిగురువులు, ప్రథములు.

వివిధమత సంప్రదాయములయందును ఇట్టి కవిత్వ మంకురించి శాఖోపశాఖలుగ నభివృద్ధినొందినది. వైష్ణవ కవుల కీర్తనలయందు రసమాధుర్యములు పొంగిపొరలినవి. ఇందుకుఁ గొన్ని కారణములు గలవు. వైష్ణవులకు 'భక్తి ప్రధానము, ప్రేమ యాలంబము. ఆత్మకును బరమాత్మకును గల సంబంధమును రాధాకృష్ణుల ప్రేమలీలలుగ సంకేతించి వారు సంకీర్తనము చేసిరి,

విరహిణియైన నాయిక యెన్ని యవస్థలకుఁ బాల్పడునో, తన్ను రాధనుగను సర్వేశ్వరుని కృష్ణునిగను సంకేతించుకొన్న భక్తుఁడును అన్ని యవస్థల ననుభవించును. నాయకుని నెడఁ బాసిన నాయిక పునః సమాగములు కెట్లు త్వరపడుచుండునో, అటులనే పరమాత్మ విశ్లేషమును సహిం