పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

82

కవికోకిల గ్రంథావళి


మాన్యమునకు అవి మర్మములు గావు. పంచేంద్రియగోచరమగు స్థూలప్రపంచమునకన్న భిన్న మగు మఱియొక యంతః ప్రకృతి గలదనియు, నశించునది పాంచభౌతిక శరీర మేగాని యాత్మ గాదనియు, జన్మాంతరము గలదనియు, నేమియుం దెలియని కూలివాని మొదలు సకలశాస్త్ర పారంగతుఁ డగు పండితుని వఱకు హిందూదేశమున నందఱును విశ్వసింతురు, ప్రతిదినము మనయింటికి బిచ్చమునకు వచ్చు దాసరిగూడ -

“మనది తనది యనుచు నరుడా, మాయలో బడబోకురా
 మరణ మొందిన మనది తనది మంటలో యే మౌనురా!
 బంకమట్టి యిల్లురా యిది బుగ్గిబుగ్గీ మౌనురా
 ఆత్మ యొక్కటె బ్రహ్మరూప మ్మంతటా తానుండురా."

అని పాడుచుండును. కావున మనవారు ఆధ్యాత్మిక గీతములను, కీర్తనలను మర్శకవిత్వమని పేర్కొనలేదు.

మొట్టమొదట ఆర్యావర్తమున వేదములయం దీయాధ్యాత్మిక కవిత్వము జన్మించి, యుపనిషత్తులయందుఁ బరిపూర్ణత నొందినది. అనుక్షణము విస్తరించుచుండిన వైదికకవి యాత్మ బహిః ప్రపంచమునఁ దనివినొందక, అంతర్ముఖేంద్రియమై యగాధమైన యమృతానందమున నోలలాడి ఆ యనుభూతిని వెలికి నిట్టూర్చినది.

“శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా, ఆయేధామాని దివ్యాని తస్థుః
 వేదాహ మేతం పురుషం మహాన్త మాదిత్యవర్ణం తమసః పరస్తాత్.”

అని వైదికఋషి. ఘోషించినాడు. ఇంతటి మహానందము వెలికుఱుకక కవిహృదయమున నెట్లు దాఁగియుండగలదు? పిపీలికాది బ్రహ్మపర్యంతముగల ప్రాణికోటులను 'అమృత