పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మర్మ కవిత్వము

పాశ్చాత్యదేశములందు శాస్త్రవిజ్ఞానము పెచ్చు పెరిఁగి లలితకళలస్థానమును సైతము నాక్రమింపఁ జొచ్చెను. కావ్యములందు మనోమోహనమయిన దివ్యానుభూతికి మాఱు మేధోవ్యాపారము అధికారస్థాపనము గావించెను. ఆతరుణమున ఫ్రాంసుదేశమునందు నిందుకుఁ బ్రతీకారముగ నొక కవిత్వోద్యమము బయలు దేఱెను. ఆయుద్యమకారకులు సమకాలీన కవిత్వముతోఁ దృప్తిపడియుండక, యింద్రియముల సంతర్ముఖములఁ గావించి, యగాధమును విశాలమునైన సూక్ష్మ ప్రపంచమును జొచ్చి, యందలి యనిర్వచ నీయమయిన సత్యమును సౌందర్యమును గానముచేసిరి. ఈ తెగకు సంబంధించిన కవులను పాశ్చాత్యులు మర్శ (Mystic) కవు లనియు, సాంకేతిక (Symbolist } కవులనియు నామకరణము గావించిరి. బాడిలేర్ అను ఫ్రెంచి కవి ఇటువంటి కవిత్వమునకు మొదటమార్గము సిద్ధపఱచెను. అనంతరము వెర్లెన్ , మ్యాలర్మీ అనుకవులు సుప్రసిద్ధులైరి. ఈ మర్శకవిత్వము యూరపుఖండమునందుఁ దన ప్రకృతి కనుకూలించిన దేశములందెల్ల వేరు నాఁటుకొనెను. జర్మనీ దేశమందు డెమ్మెల్ అను యువక కవియు ఆతని యనుచరులును, అయిర్లాండునందు ఈట్సు, యే. యి.