పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వతత్త్వ నిరూపణము

1. కవి

ఓ కవీశ్వరుఁడా, నీవు సృష్టికర్తవు. నీ సృష్టి లోకోత్తరము; అనన్య పరతంత్రము; ఆనందదాయకము. నీమహిమ వర్ణనాతీతము. నీ నిర్మాణము దైవసృష్టిని సైత మధ:కరించు చున్నది. నీ కల్పన యాదర్శప్రాయము.

నీ సృష్టియందు లతికలు జంగమలు; శంపాలతలు నిశ్చలములు. కలువకంటులు, కలకంఠకంఠులు, చంద్రముఖులు, విద్యుల్ల తాంగులు నీ పట్టములలోఁ జరియించు . సామాన్య స్త్రీలు! నీకు పరిచితలైన యువతులెల్లరు సౌందర్య వతులు; హృదయ సమ్మోహన మంత్రాధిదేవతలు! అందరు సీతలు, సావిత్రులు, దమయంతులు, చంద్రమతులు, ద్రౌపదులు, శకుంతలలు.

ఓయి కవితాశిల్పి, నీచే సమ్మానింపఁబడిన పురుషులందఱు వీరులు, లోకోత్తరకార్య దురంధరులు! భూమిని చాపకట్టుగాఁ జుట్టగలిగిన హిరణ్యాక్షులు; విశ్వమును మూఁడడుగులతోఁ గొలువఁగలిగిన వామన మూర్తులు; రాజలోకమును గండ్రగొడ్డంట నఱికి రక్తప్రవాహముచేఁ బితృతర్పణము గావించిన పరశురాములు; ఱాల్గరగంగ వేణుగానము గావించిన శ్రీ కృష్ణమూర్తులు, సముద్రమును మధింపఁగల