పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

61


రించుచున్నాము? అటులనే కవి చేయు గానము మానవ సమాజము నుద్దరించుటకు యోగ్యమైనదిగ నుండుటవలననే గౌరవింపఁబడుచున్నది. 'నాకు నోరున్న ది. తిట్టుటకు చాల మాటలు తెలియును. కావున నేను తిట్టుకొనుచుందును' అని చెప్పి వీధుల వెంబడి తప్పుదారి కూఁతలు కూయుచుఁ దిరుగు చుండిన 'ఆతనికి పిచ్చి పట్టిన' దని పిచ్చివారి ఆసుపత్రికి పంపుదుము. సమాజ మెట్లు తనయందలి వ్యక్తికి బాధ్యమొ, వ్య క్తికూడ సమాజమునకు బాధ్యుఁడు.

కవి యొకమూలఁ గూర్చుండి తన సంతోషముకొఱకు నొక కావ్యము రచియించుకొని దానిని బదిలముగ నింట దాఁచుకొని యుండినయెడల నేలాటి యిబ్బంది లేదు. అట్లుగాక కవిరచనలు వ్యాప్తిలోనికివచ్చి, లోకజీవనము పై నధికారము చేయుచుండును. కావున నందఱికంటెను కవికి బాధ్యత యెక్కువ. ఉత్తమకవి సృష్టియం దా కాలపు మానవ సంఘమునందలి సమంచిత భావములు మూర్తీభవించి యుండును. ఆతని రచనలందు భవిష్యద్వాణి రహస్య మర్మర రవములతో సంభాషించుచుండును.

మానవ జీవితమునకును శిల్పమునకును సహజమైన సంబంధము గలదు. జీవిత ప్రయోజనము ననుసరించి శిల్ప ప్రయోజనము కూడ నిర్ణయింపఁబడుచుండును. మన జీవితమును గుఱించి ఉమ్రఖయ్యాం (Omar Khayan) అను పారసీక కవి యిట్లు నుడివియున్నాఁడు: