పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

47

గానమున రాగము ప్రధానము. తక్కిన గుణములన్నియు రాగమునకు లొంగియుండును. కవిత్వమున రామణీయకము ముఖ్యము; ఇతర గుణములు దానికి పోషకములుగ నుండును. భాస్కర్యమునందు నిమ్నోన్నత స్థలములును ఘనిష్టతయుఁ జక్కగఁ బ్రదర్శింపఁబడును. చిత్రకళ మూలమున వివిధ వర్ణములతో సూక్ష్మాతి సూక్ష్మములైన వివరములనుగూడఁ జిత్రించి దృశ్యమును కన్ను లకుఁ గట్టినట్లు చేయగలము. కావున నొక్కొక కళకు నొక్కొక విషయము ప్రధానముగ నేర్పడినది. కవిత్వమునకుఁ బ్రతిక్షణ భిన్నములగు మానవ చర్యలును, చిత్రలేఖనమునకు విశాల దృశ్యములును, భాస్కర్యమునకు విగ్రహరచనయు ననుకూల వ్యాపారములు. ఇట్లగుటవలన, కళలన్నిటిని పృథఃకరించి వాని వానికిఁ గల సంబంధమును ద్రెంపివైచుటకు నేను సాహసింపను. కళలన్నియుఁ బరస్పర సాపేక్షకములు, కవిత్వమునఁ గొంత చిత్రలేఖనము చిత్రలేఖనమునందుఁ గొంత కవిత్వమును అవిభాజ్యముగ మిళితమైయున్నది.

చిత్రకారుఁడు స్థలపరిమాణ బద్దములగు రంగుల నుపయోగించును. కవి కాల పరిమాణ బద్దములగు శబ్దముల నుపయోగించును. చిత్రకారుఁడు రూపమునకుఁ జర్యను వశవర్తినిఁ జేయును. కవి చర్యకొఱకు రూపమును వర్ణించును. చిత్రకారుఁడు అనంత కాలమునుండి యేదో యొక క్షణమును (అనఁగా ఆక్షణములో జరుగు కార్యమును) గ్రహించి దానికి శాశ్వతస్థితిఁ గల్పించును. కవి క్రమముగఁ బ్రతిక్షణమునం జరుగు కార్యముల వర్ణించుచుం బోవును.