పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

43

రసము మానవచర్యలకే సంబంధించియుండుననియు, తిర్యగ్జంతువుల చేష్టలయందు రసస్పర్శ గలదనియు, అచేతన వస్తువర్ణనములు రసాభాసము లనియు, ఆలంకారికులు చెప్పుచున్నారు. ఇది చింత్యము. ఏలయన, అచేతన వస్తువులు గూడ రమణీయ భావముల బ్రేరించును. అవి యనుభవింపఁబడునపుడు ఆనందము పుట్టును. సుఖానుభవ యోగ్యమగు ప్రతిభావమును రసత్వము నొందఁగలదు, క్రౌంచపక్షి శోకము వాల్మీకిని అశ్రుగద్గద కంఠుని గావించినది. గొఱ్ఱె పిల్ల బుద్దుని హృదయమునఁ గరుణాంస మొలకించినది. ఉషస్సులను దర్శించిన వైదిక ఋషులు ఆనంద నిర్మగ్నులై వాని నత్యద్భుతముగఁ గొనియాడిరి. ఆషాఢ మేఘము నీరస భావద్యోతక మైనయెడల, కాళిదాసుఁడు దానినిఁ దన కావ్యమునకు ఆలంబముగఁ గొనునా? అయిన మఱియొక టి. మానవ చర్యలు హృదయుమునకు దగ్గఱివిగావున వాని మూలకముగ భావోత్కర్షత గలిగింపవచ్చును; కాని యింత మాత్రమునకె తదితరములు నీరసములని శాసించుట సాహసము. తేనెలో మెదిపిన వస్తు వేదైనను రుచిపుట్టించునటుల ఏభావమైనను సౌందర్యవాహకమై సుఖానుభోగ్యమగును. రస నీరసత్వములు కావ్య సమర్పితవస్తువుల చేతనా చేత నత్వమునకు సంబంధించియుండక కేవలము అలౌకిక కల్పనా చమత్కృతియొక్క భావాభావములపై నాధారపడి యుండును. రసమునకుఁ జమత్కారమే ప్రాణమని విశ్వ నాథుఁదు నుడివియున్నాఁడు. కల్పనా చమత్కృతి లేనిదే వాక్యమునకు కావ్యత్వము సిద్ధింపదు. కావునఁ బ్రతి కార్య