పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కవికోకిల గ్రంథావళి


రసము అనుభవ సిద్ధమగునది. భావచర్వణము, రసానుభవము నేక కాలమున జరుగుచుండును.

వస్తువునందు భావములేదు; కాని భావస్పోరక హేతు వున్నది. అటులనే కావ్య సమర్పిత విషయములు అనుభవ రసికుల హృదయములందు భావముల స్ఫురింపఁ జేయును. ఉదాహరణము: నీటియందు ఱాయి రువ్వఁబడినపుడు తరంగములు రేఁగును, నీటియందు లీనమైయున్న యలలు కారణ మలవడుటవలన వ్యక్తము లయినవి. అటులనే మన మనము నందు వాసనారూపముగ లీనమైయున్న సుఖక్లేశాది భావములు కావ్వగత హేతు ప్రేరితములై స్వరూపములు దాల్చి యనుభూతము లగుచున్నవి.

అట్లయిన కావ్యమునందు రసము లేదా ? కావ్యము నందు భావ ప్రేరక విషయములు గలవు. ఆ భావములె అనుభూతము లగునపుడు రసత్వము నొందుచున్నదని యిదివరకే తెలిసికొనియుంటిమి. అట్లయిన కావ్యము రసవంతముగ నున్నదని యేల చెప్పుదురు ? సామాన్యమైన వాడుకనుబట్టి బియ్యము అన్నమునకు వలెనే భావమునకును రసముసకును గొంత భేదముగలదు. అప్పుడె యెసటిలో బియ్యమును బోసి ప్రొయ్యి మంటపెట్టు వంటవానిని 'నీ వేమి చేయుచున్నా 'వని యడిగిన, 'నేను అన్నమువండుచున్నా 'నని జవాబు చెప్పును. అన్న మే యైన యెడల వండనక్కఱలేదు, ఈ సందర్భమున బక్వము కాని బియ్య మెట్లు అన్నమని పేర్కొనఁబడినదో అటువలెనే కావ్యము గూడ, అంత్యఫలముదృష్టియందుంచు కొనఁబడి, రసవంతమని యూహింపఁబడుచున్నది.