పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

39


వారినిఁ గూడ (చూచుచుండియు) కనుఁగొన లేము. ఇంద్రియములు గొంపోవు సూచనలను బుద్ది గ్రహించునప్పుడె జ్ఞాన ముదయించుచున్నది. అది యెట్లన : మన మొక పుస్తకమును జూచి దానిని పుస్తకమని గుర్తింతుము. నయనేంద్రియములు కొనిపోయిన రూపమును ఇదివఱకు స్మృతి యందడఁగియున్న పుస్తక రూపముతో సరిపోల్చి, దాని వంటిదే ఇది కావున 'ఈ రూపము పుస్తకము' అని బుద్ధి నిర్ణయించును. కాని, యీవ్యాపారము అమిత త్వరితిము గను అలక్షితముగను జరుగుచుండును గావున సామాన్యముగఁ దెలిసి కొనుట కష్టము. మొట్టమొదట బుద్ధికి పుస్తక రూపజ్ఞానము లేనియెడల అట్టి వస్తువును జూచినపుడు 'ఇది ఫలానిది' యని నిర్ణయించుటకు వీలు లేదు

వస్తు స్వభావ జ్ఞాన ముదయించిన వెంటనే ఆలోచనయు, దాని వెంట భావమును (మనోవికారమును), తరువాతఁ గోర్కెయు, దానితోడ సంకల్పనమును, అనంతరము కార్యమును బుట్టుచుండును ఉదాహరణము: మనమొక దారిలో నడుచుచుండగా నొక పుట్ట యొద్ద, కాలికి మూరెఁడు దూరమున పామును జూచితి మనుకొందము. దానినిఁ జూడఁగనె పైన వివరించిన విధమున వస్తుస్వభావ జ్ఞానము గలుగును పాము దగ్గరనున్నందువలనఁ గఱచు నని తలంతుము (ఇది ఆలోచన), తలఁచిన వెంటనే భయము గలుగును (ఇది భావము), తరువాత దానినుండి తప్పించు కొనవలయునని కోరిక పుట్టును(ఇదికోరిక ). దానిని నెఱవేర్చు కొనుటకు ధృఢసంకల్పనము గలుగును (ఇది సంకల్పము),