పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

36

కవికోకిల గ్రంథావళి


పలుకులకు ఈడనవచ్చును! కోటి సంవత్సరములు తలక్రిందయి తపసుజేసినను ప్రకృతి యిట్టి యపూర్వ వస్తు గుణ సమ్మేళన మొనరింప లేదు. కావున సుక విపల్కులకు అసంపూర్ణ మయిన సృష్టి , యెట్లు ఈడనవచ్చును? వస్తుగుణములను అపూర్వముగ నేర్చి కూర్చుటయందు కవి అత్యంత నిపుణుఁడు. ఈ నైపుణ్యము భావనకు సంబంధించిన మహిమ. కవి కల్పనములు కొన్ని యెడల అలౌకికము లైనను చదువరులకు బోధపడకపోవు. ఏలయన : సంయోగము క్రొత్తదైనను వస్తువులుమాత్రము పూర్వపరిచితములె. తాను సృజించిన వస్తువు స్వభావికమా, లేక యస్వాభావికమా యను విచారము కవి కనవసరము. ఇట్టినవస్తువు భావప్రపంచమున నుండిన నెంత రమ్యముగా నుండును అను తలంపె కవికి ముఖ్యము; రసనిష్పత్తికి సాధక మగునేని నెట్టి యలౌకి కేంద్రజాలమునైనఁ బన్నవచ్చును. ఏలయనఁగా కవిసృష్టి యానందమాత్ర ప్రయోజనము గలది. -

ఆదర్శప్రాయమగు రూపమును జిత్రించు చిత్రకారుఁడు ఏదో యొక బహిరాకృతినిఁ దన రచనకు ఆలంబముగఁ గొనఁడు. ఆ రూపమును తాను భావనచేసిన తన మనమునందుఁ బ్రతిబింబించిన విగ్రహమును పటముపైఁ జిత్రించును. అటులనే కవియు భావనా కల్పితమైన చర్యలను వాగ్రూపమున వెలిపుచ్చును. ఒక యుదాహరణము: చిత్రకారుఁ డొకఁడు రతీదేవి స్వరూపమును లిఖంపవలయు నని తలంచి యొక సౌందర్యవతిని ఆదర్శముగఁ దీసికొని తత్ ప్రతిబింబకముగఁ జిత్రించును. రతీదేవి స్వరూపమునందు