పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

కవికోకిల గ్రంథావళి

రీఁదినట్లు శ్రమకుఁబాత్రులయ్యు గమ్యస్థానము చేరఁజాలరు. ఉత్తమ కవులెల్లరు తమ ప్రకృతి కనుకూలించిన రచనల యందె శక్తిసామర్ధ్యములను వినియోగించి కృత కృత్యులైరి.

కావ్యము చిరంజీవముగ నుండవలయునన్న అందలి వస్తువుగూడ సర్వజనీన స్వభావమును, దదనుగుణమయిన మనోవికారములను వెల్లడించుట కనుకూలమైనదిగ నుండవలయును. ఏలయన, దేశ కాలపరిస్థితులకు లోఁబడిన సంకుచిత విషయములును, భావములును అన్ని కాలములయందు నందఱిని రంజిపఁజేయఁజాలవు. ఆచార వ్యవహారములు, భాషలు వేఱైనను మానవుల మనోవికారములు అంతటనొకేవిధముగ నుండును. సుఖదుఃఖములు, మంచిసెబ్బరలు, జన్మమరణములు సర్వసామాన్యముగ మానవజాతికంతయు సహజము: శృంగార వీర కరుణాధిరసము లందఱుకు ననుభోగ్యములుగ నుండును. అట్టిరసములాదర్శప్రాయముగఁ జిత్రింపఁ బడినపుడు దేశ కాలపాత్రాతీతములై సర్వజనానురంజకములుగ నుండఁ గలవు. ఇంగ్లీషు నాటకములు చదివి మనమానందించు చున్నాము; సంస్కృత నాటకములను జదివి పాశ్చాత్యులు సంతోషము నొందుచున్నారు. ఎందువలన? నోటిగుండ వెడలు భాష రెండు దేశములవారికి వేఱయ్యును హృదయము నుండి వెడలు మనోవికారములభాష మానవజాతికంతయు సామాన్యము. కావున నొక కావ్యము చిరంజీవముగ నుండవలయునన్న సర్వజనీన స్వభావ ద్యోతక వస్తు సంవిధాన కల్పనా చమత్కృతితో నొప్పి యుండవలయును. ఇందుకు