పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

27

కావ్యలక్షణమని పలువురచే నంగీకరింపఁబడి యుండుటచేతను, ఉత్తమ మధ్య మాధమ కావ్యవిచారము జీవత్వము సిద్దించిన వెనుక జరుగు చర్చ యగుటచేతను, ధ్వనిని కావ్యసౌందర్యాపాదకము లగు నుత్తమ గుణములలో నొకటిగ గ్రహింపవచ్చును.

రసము కేవలము మానవ చర్యలకు సంబంధించినదే యైనయెడల అవ్యాప్తిదోషమువలన కావ్యాత్మ కానేరదు.

అట్లయిన నిఁక కావ్యాత్మ యెట్టిది? ఆత్మ అంత స్సారభూతమయినది. ఇదిమిత్థమని వర్ణించుటకు నలవిగానిది. కావుననే భిన్న నిర్ణయములకుఁ బాత్రమయినది! ఉపనిషత్తులు బోధించు ఆత్మ వేఱు; ఆ యాత్మ అవాఙ్మౌనసగోచరము, కావ్యాత్మ ఇంద్రియ గోచరమును అనుభవసాక్షికము నగు సౌందర్యస్ఫురణము. పాంచభౌతికమయిన ప్రకృతి చిత్సంబంధమువలనఁ బ్రాణవంతమగునట్లు, కావ్యసామగ్రి కవి ప్రతిభతోడ సంయోగమునొంది. జీవన్మూర్తిని దాల్చు చున్నది. కావ్యమునకు కవిప్రతిభయె జీవితము. కావ్యము నందలి చిత్ప్రకాశము సౌందర్యస్పురణముగ గోచరించును, శిల్పనైపుణ్యమును కవితాసామాగ్రియు నవిభాజ్యముగ నొకదానియం దొకటి లీనమయినపుడు సజీవవిలసనము కావ్యమునందుఁ దేలియాడుచుండును. అది సహృదయ హృదయైక వేద్యము. గాలి కంటి కగుపడక యున్నను స్పర్శేంద్రియమువలనఁ దెలిసికొనఁబడునటుల, కావ్యాత్మ యిట్టిదని వచియింపనలవిగాకున్నను ఆనందజనకశ క్తివలన నూహింప సాధ్యమగును.