పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

23

వలనఁ జిప్ప లోపలిభాగమున కంటుకొనియున్న పింగాణిరంగు వానచినుకుపైఁ జుట్టుకొని దానినొక యమూల్యమైన ముత్యముగ మార్చివేయును. ఇటులనే బహిః ప్రపంచసంగతి. వలన కవి మనమునఁ గొన్ని వికారము లుప్పతిల్లి అవి యాతని రసార్ద్రభావములందలి యింద్రధనుర్వర్ణములతో వెలికుఱికి లోకమోహన స్వరూపమును దాల్చును. కవిభావ మేవస్తువుపైఁ బ్రసరించునో యదియెల్ల రూపాంతరము నొందును. అనిర్వాచ్యమైన సౌందర్యము దాని నాశ్రయించి యుండును. ఎన్నియో వస్తువులను పలుమాఱు చూచియుందుము. కాని, అవి మన చిత్తముల నాకర్షింపఁజాలక పోయియుండవచ్చును. ఆ వస్తువే కవిభావముతో మొలాము చేయఁబడినప్పుడు ఇది వఱకు లేని క్రొత్తందనమును జక్కందనమును వహించి మన దృష్టి, నాక గొనును. ఎన్ని మాఱులు ఆషాఢమాసమునందలి మేఘములను మనము చూచియుండలేదు? ఆ మేఘమె కాళిదాసమహాకవి కావ్యాంబరమున భావకిరణ శబలితమయి పొడకట్టి మనలను ఆనందపులకితులను జేయుట లేదా? ఇదియే కవిత్వేంద్రజాలము!

______

4. కావ్య జీవితము.

నిర్జీవములగు కావ్యములు సహృదయానురంజకములు గానేరవు. అట్టివి చచ్చుబిడ్డలు. అవి నిరాదరణ పాత్రములై యెట్టకేలకు నశించిపోవును. కొందఱి కవుల యొక్కయు కావ్యములయొక్కయు పేరులు కవుల చరిత్రలందు మాత్రమె భద్రపఱుపఁ బడియుండును. కాని, మఱికొందఱి కవుల నామ