పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

22

కవికోకిల గ్రంథావళి

దృశ్యమును జూచినపుడు మన మానందము నొందుదుము. అంతట మన యనుభవమును నితరులకుఁ దెలుపవలయు నను కోరిక యొకటి పుట్టును. వినినవారు సంతసించుచుండ మన యానందమును వర్ణించి వర్ణించి సంతృప్తి నొందుచుందుము. కోరిక పుట్టిన వెనుక దానిని దీర్చుకొననిదే మన మనసు కుదుటఁబడియుండదు. మన యనుభూతి నితరులకుఁ జెప్పుటకుఁ జేతకానియెడల నొకవిధమైన యతృప్తి గలుగును. మనభావములను పదిమంది స్నేహితులకు వెల్లడిచేయనిదే ఆనందము పరిపూర్ణమైనటులఁ దోఁపదు. అందువలననే మన మేదైన సంతోషవార్త వినినప్పుడు దానిని నందఱికి జెప్పుచుందుము. ఇది సామాన్యమైన మానవ స్వభావము. కాని, కవియందిట్టి స్వభావ మతి బలీయముగనుండను. నిశితములును, శిక్షితములును, సంయమితములును, అందువలననే యుత్పతనక్షమములును నైన కవి మనోవికృతులు తుట్టతుదకు నిర్బరములై లయాన్విత వాగ్రూపమునఁ బ్రవహించును. భావోద్రేకము గలిగినపుడు ఆయావికారములకుఁ దగినటుల వాక్యములువెడలుట మానవులకందఱికి సహజమైనను, కవియందు మఱొక విశేషము గలదు. కవి వాక్యములు ఏవోకొన్ని నిర్మాణ న్యాయముల కనుగుణముగ మూర్తీభవించుచుండును,

ముత్తెపుఁజిప్పలో వానచినుకు పడినపు డది మంచి ముత్యముగ మాఱునుగాని, కాకిచిప్పలోఁ బడినపుడుమార్పు నొందదు. ఎందువలన? ముత్తేపుఁజిప్పయందుఁగల సృజనశక్తి కాకిచిప్పయందుండక పోవుటవలన. నీటిబొట్టు ముతైపుఁజిప్ప కడుపులోఁ బడినప్పుడు అందొక వికారము పుట్టును. అందు