పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

259


డెను)పవిత్రభావముల మధ్యనుండిననాఁడు ఆస్తికుఁ డెట్లు కాక యుండును? అట్టివాఁడు మీరాకు అట్టిచావు ఎట్లువిధించును? అట్టిసతిపై శంక యెట్లు కలుగును ? ట్రాజెడి సంభవించుటకు కులభేదము, మతభేద ముండవలయును. ఏడెనిమిది సంవత్సరములు సుఖజీవనము చేయుచుండిన భార్యాభర్తల నడుమ ట్రాజెడి పుట్టడు. రాణా నెమ్మదిగా నాలోచించుకొని తన భ్రాంతిని తొలగించుకొని యుండవలయును. అట్లు జరుగలేదు కావున ఇది అసంభావ్య వస్తువు, కావుననే ఈవస్తువు రసలుబ్దునిచిత్తమున కెక్క లేదు !

రసలుబ్దుఁడు మీరాను ఆటఁజూచు సామాజికుల దృష్టితోఁ జూచుచున్నాఁడేగాని కుంభరాణా దృష్టితోఁ జూచుటలేదు. ఇదిగొప్ప పొరపాటు, ఈ పొరయే రసలుబ్ధునిఁ 'ట్రాజెడీ’కి హేతువైనది. రాణాకు మీరా ఎట్లగపడును? ఆతని మనస్తత్వమేమి? అని విచారింపవలదా? పాండవులు, భీష్ముడు, విదురుఁడును శ్రీకృష్ణుని దైవస్వరూపమని తలంచినను, రాజబంధువు బంధించుటకుఁ దగినఁవాడు అనియే గదా దుర్యోధనుఁడు తలంచెను. వేనవేలు సంవత్సరములు ఘోర తపమాచరించి చావులేని వరముఁగొన్న హిరణ్యకశిపుఁడు పరమభక్తుఁడైన ప్రహ్లాదుని భక్తిప్రభావము నడుమనుండియు ఏల విష్ణుభక్తుఁడుగ మాఱ లేదు. ఎవరి ప్రభావము నడుమనుండి విభీషణుఁడు రామభక్తుఁడాయెను? అదివారివారి మనస్తత్త్వములఁ బట్టియుండును. హిందువుల కుటుంబములలోఁ బుట్టినయందఱును ఆస్తికులు కావలయునను నియతియున్న దా! మతము వంశపారంపర్యాగతమగు ఆస్తి