పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

కవికోకిల గ్రంథావళి

ట్రాజెడి లక్షణములను గొన్నిటిని వివరించి యాలక్షణములకు మీరానాటక మెంతవఱకు సరిపోవునో చూతము: కథానాయకుఁడు రాజుగాఁగాని లేక యంతటి గొప్పవాఁడుగాఁగాని యుండువలయును. ఇట్లనుట సర్వజనీనత సంపాదించుట కొఱకు. రాజు దురవస్థయు, మరణమును రాష్ట్రమున కెల్ల సంబంధించి యుండును. కావున అట్టి నాయకుని యధః పతనముఁ జూచినపుడు మనకును సహానుభూతి కలుగును. నాయకునకు ధీరత్వము, ఉదాత్తత, దృఢ సంకల్పశక్తి, మానవ సహజము లగు గుణదోషములును ఉండవలయును. నాయకుఁడు సకల సద్గుణ సముపేతుఁడగా నుండెనేని మనకు జాలిపుట్టదు, వికర్షణము కలుగును. నాయకుఁడనుభవించు దుఃఖమునకు ఆతఁడును గొంతవఱకు బాధ్వుఁడను సూచన లేనిదె మనము సహించియుండ లేము. ఎట్టి కొఱంతయు లేనట్లు నాయకుని శీలము చిత్రించుట నీతిమంతులకు గుణమైనను, శిల్పులకు అది అవగుణమనియె నామనవి. ముఖ్యముగ వధాంత నాటకముల లోని నాయకునకు ఏవైన కొన్ని గుణలోపములు లేనియెడల దురవస్థ సంభవింపదు; నాయకుని పూర్వసుఖస్థితిని బ్రదర్శింపవలయును, లేక , సూచింపవలయును. ఉత్తరోత్తరము సంభవించు దురవస్థకును మున్నటి సౌఖ్యమునకుఁ గల తార తమ్యము వలన నాయకుని కష్ట పాటు మఱింత నిశితముగ మన మనస్సున నంకితమగును. ఈ వధాంత నాటక ప్రపంచమున నాయకుని యుద్దేశములు, కోర్కెలు, కార్యరూపమునఁ బరిణ మించునపుడు విరుద్ద ఫలప్రదములగును, “తానొకటి తలఁచిన దైవ మొకటితలఁచె" నను నానుడి యీనాయకుని యెడ