పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/246

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

240

కవికోకిల గ్రంథావళి


మునకుఁ గథాప్రసరణమునకుఁ బ్రతికూలమైనను సంస్కృత నాటకములందుఁ గవిత్వభాగము హెచ్చుగనుండును. ఈ కాలపు నాటకములలో నట్టివర్ణనములకు అంత యవసర ముండదు. షేక్‌స్పియరు నాటకములకును, ఇబ్సన్ , బియరన్ సన్ , గాల్ స్వర్ధి , బెర్నార్డుషా మున్నగు ఆధునికుల నాటకములకునుగల " Technique" భేదమును గ్రహింతు \మేని నాటకరచనాపద్ధతి యెంత అభివృదియైనదో మన మెఱుంగకపోము. కాని అభివృద్ధిసూచకములుగా నున్నను మార్పులు గలిగినపుడెల్ల పూర్వాచారపరాయణులగు పండితులు ప్రపంచము తలక్రిందై పోవుచున్నదో యనునట్లు గగ్గోలు పడుచుందురు. క్రొత్తప్రాఁతల సంధికాలమున నిట్టిపోరాటములు తప్పక సంభవించుచుండును.

ఇతర కళలవలెనే నాట్యకళసైతము రాజాశ్రయముననే యభివృద్ధిచెందినది. రాజప్రాసాదములందు నాట్య మండపము లుండెను. వసంతోత్సవ సమయములందు రాజుల యొక్కయు పండిత నాగరకులయొక్కయు వినోదముకొఱకు నాటకములు ప్రదర్శింపఁబడు చుండెను. రాజులు శృంగార ప్రియులు; అంతఃపురములను స్వర్గతుల్యముగ నొనర్చు కొనిన సంపన్నులు. వారికి జీవితము సుఖమయము, కావుననే మన దేశమున శృంగార రసప్రధానములైన నాటకముల సంఖ్యయే హెచ్చుగనుండును. వీరరసము గ్రాహ్యమయ్యును దానికిఁ బ్రాధాన్య మొసఁగి వ్రాయఁబడిన నాటకముల సంఖ్య అల్పము. కాలక్రమమునఁ బరిస్థితులు మాఱినవి. శృంగార వీరములకన్న నన్యములగు కరుణ శాంతములు