పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

232

కవికోకిల గ్రంథావళి

కవియే కథ చెప్పినట్లుగాక పాత్రలే మన యెదుట నిలబడి వ్యవహరించునట్లు, వారి మనోవృత్తులు భావవికారములు, అభినయ వర్ణనమూలమున మూర్తీభవించునట్లు రచించుటె తిక్కనగావించిన గొప్ప మార్పు. నాటక పద్దతివలన తెలుగు భారతమునకు అపూర్వమైన చైతన్యము కలిగినది. తిక్కన యెక్క డెక్కడ రసాభ్యుచితముగ మూలాతిక్రమణము చేసెను, ఎక్క డెక్కడ ఔచిత్యమును పోషించెను అను చర్చకు నిదర్శనపూర్వకముగ పూనుకొందు మేని భారతమంత పెద్ద విమర్శన గ్రంథము వ్రాయవలసి యుండును. అయినను ఆ మహాకవి అవలంబించిన రచనా పద్దతులను కొన్నిటిని చూచెదము.

(1) సంభాషణమూలకమైన నాటకుపద్దతిలో కథ నడుపుట,

(2) రసపోషణకుగా యథేచ్చముగ మూలము నతిక్రమించుట, అమూలకమును చేర్చుట, మూలమును మట్టగించుట.

(3) వస్తువు యొక్క ఐక్యమునకూ కథాగమనమునకూ అభ్యంతరములైన భగవద్గీతలవంటి వానిని వదలుట,

(4) పాత్రలు ప్రాణవంతములుగ స్ఫురించుటకు అంగ వికారాద్యభినయములను కన్నులు గట్టినట్లు వర్ణించుట.

(5) పాత్రల వ్యక్తిత్వము భిన్నత్వము పరిస్ఫుట మగునట్లు శీలమును పోషించుట.

(6) ఔ చిత్యమును పోషించుట.