తిక్కన
231
కేతన రచించిన దశకుమార చరిత్రమువలన తిక్కననుగుఱించి కొంత తెలిసికొనవచ్చును. తిక్కన బహు కళా సంపన్నుడు. వాక్పతినిభుడు. సకలాగమార్థ తత్తవేత్త. ఉభయకవిమిత్రుడు. ఇంతేకాదు. తిక్కన అభిరూప భావ భవుడు, కామినీ చిత్తచోరుడు. వుజాతత్పరుడు, ధీరుడు ,
తిక్కన నిర్వచనోత్తర రామాయణమున "నే నుభయ కావ్య ప్రౌఢిఁ బాటించు శిల్పమునం బారగుడం గళావిదుడ”నని చెప్పియున్నాడు. కవిత్వము శాస్త్రము కాదనీ, శిల్పమనీ, కళయనీ తిక్క న గ్రహించినాడు. తిక్కన మహిమను పూర్ణముగ తెలిసికొన్న పూర్వకవులలో ఎఱ్ఱన ప్రథముడు,
తనకావించిన సృష్టి తక్కొరుల చేతంగాదునా, నేముఖం
బునఁ దాఁబల్కినపల్కులాగమములై పొల్పొందునా, వాణిన
త్తను నీతండొకరుండ నాఁజసుమహత్వా ప్తిం గవిబ్రహ్మ నా
ది నుతింతుం గవి తిక్కయజ్వ సఖిలోర్వీదేవ తాభ్యర్చితున్.
తిక్కన కావించినది. సృష్టి, అది యితరులచేత గానిపని, ఆయన కవిబ్రహ్మ. ఇది యెట్లు? సంస్కృతమునుండి తెనిగించినది స్వతంత్ర సృష్టి యెట్లయినది ? సంస్కృత మూలముతో తిక్కన భారతమును సరిపోల్చి చూచినప్పుడే తాను కావించినది సృష్టియని గోచరించును.
ఒకటి రెండు వాక్యములలో సంస్కృత భారతమునకును తిక్కన యాంధ్రీకరణమునకునుగల తారతమ్యము చెప్పదలతుమేని - మూలము అస్థిపంజరము - తిక్కన ఆంధ్రీకరణము రక్తమాంసయుతమైన జీవన్మూర్తి.