పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

కవికోకిల గ్రంథావళి

కవులు పూర్వులైనను, ఆధునికులైనను ప్రకృతిని వర్ణించుటయందు రెండుపద్ధతులను అవలంబించిరి. కవుల దృష్టికి ప్రకృతిలోని ప్రతి అణువును ప్రాణవంతముగ సగపడు చుండును. అందువలన ప్రకృతిని మానవీకరించుట, మానవుని కష్టసుఖములతో ప్రకృతి సహానుభూతి చూపుచున్నట్లు వర్ణించుట మొదలైనవి ప్రథమ విధానము. ప్రకృతి సౌందర్యమును స్వాభావికముగ వర్ణించుట రెండవ విధానము. ఈ రెండు విధానములను మన కవులు, ఇంగ్లీషు కవులు సమానముగ నవలంబించిరి. మనుచరిత్రమున “తరుణి ననన్యకాంత, నతిదారుణ పుష్ప శిలీముఖ వ్యధాభర వివశాంగి నంగభవుబారికి నగ్గముచేసి క్రూరుడైయలిగె మహీసురాధము డహంకృతితోనని రోషభీషణ స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెకషాయ దీధితిన్” ఇచ్చట సూర్యునకు మానవత్వ మారోపింపబడినది. వరూధిని దురవస్థకు మనసు మెత్తవడి, అందుకు కారకుడైన ప్రవరాఖ్యునిపై గోపముగల్గి “వీని మొగమునైన చూడ గూడద"ని సూర్యభగవానుడు అస్తమించుచున్నట్లుగ వర్ణింపబడినది. ఒక యాధునిక కవి, తన దుఃఖమున ప్రకృతి మిత్రునివలె పాల్గొనుచున్నదని రచించెను;

చిత్తతాపంబు బాపుకోఁ జేలగట్ల
కరిగి కూర్చుండ, మూకసహానుభూతి
పైరు తలవంచు భారంబుపంచికొన్న
ప్రాణసఖులట్లు; కవులకు ప్రకృతితోడు.