పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యములో రమ్యత

207


శబ్దాడంబరత మున్నగు కావ్యదోషములు భావమును అవగతము చేసికొనుటకు ప్రతిబంధకములు గావున అవి పరిహరింపదగినవి.

అనౌచిత్యము రసభంగహేతువుగాన అది ముఖ్యముగ పరిహరింప తగినది. ఔచిత్యమనగా Commonsense, లోక జ్ఞానము జీవితమునం దెంత అవసరమో కావ్యమునందు కూడ ముఖ్యమె. ఆది మధ్యాంతములుగల కావ్యాకృతి యందు అంగాంగ సంయోగిత, అవయవాను రూపత్వము పరిపూర్ణతను చేకూర్చి రామణీయకమునకు సహాయకారి యగును.

కవి తన కావ్యమునందు ఇట్టి సౌందర్యాపాదక సామగ్రిని చేకూర్చి, శబ్దార్దములకు సమాన గౌరవముచూపి శ్రోత్రపేయత్వము సంతరించి రమణీయసృష్టి చేయుచున్నాడు. గావున సాహిత్యములో సౌందర్యము ఘనీభవించి యుండును. - (ఆలిండియా రేడియోవారి సౌజన్యంతో)


____________