పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

కవికోకిల గ్రంథావళి


వలయును. అట్లు లేనియెడల అపూర్వకల్పనాశక్తి యున్నను ఆలోపమును పూరించలేదు,” అని వ్రాసియున్నాడు.

భావమునకు ప్రకటనకు బింబ ప్రతిబింబ భావసంబంధము గలదు. కవి మనస్సులో ప్రస్ఫుటముగ ఏర్పడిన భావము అట్లు ప్రకటితమగును. అట్లుకాదేని, అపూర్ణముగను క్లిష్టముగను ప్రకటింపబడును. మన భావములు వాచ్యముగను వ్యంగ్యముగను ప్రకటింపవచ్చును. వాచ్యమునకన్న వ్యంగ్యమే రమణీయమని అందరును ఒప్పుకొని యున్నారు. అయినను ఏ మహాకవి రచించిన కావ్యమునందు గూడ ప్రతి పద్యము ప్రతివాక్యము ధ్వని ప్రధానముగ ఉండదు. గుణము హెచ్చుకొలది రాశి తగ్గుచుండును. ప్రయత్న పూర్వకముగ శ్రమపడి వ్రాయుదుమేని శ్లేష కావ్యములవలె సహజ సౌందర్యమును కోలుపోయి హృదయాకర్ష కముగ నుండదు. కొందరు ఆధునికులు భావశబ్ద క్లిష్టత్వమును ధ్వనియని పొరపడినట్లు కనుపించును. ధ్వని ప్రధానముగా నున్న పద్యమునందు, శ్లోకమునందు ప్రకృతార్థము చక్కగా బోధపడుచూ వ్యాక్యాతిశయ మయిన వేరొక భావము స్ఫురించును. ధ్వని యెప్పుడు నేల విడిచి సాముచేయదు. ధ్యనికి బీజము పద్యములో నే ఉండును,

కావ్యమునందు సౌందర్యాపాదక హేతుసామగ్రిని స్వీకరించుటయేగాక తద్బంగ హేతువులను వర్ణించుటకూడ అవసరమె. దూరాన్వయము, దురన్వయము, అన్వయ కాఠిన్యము, భావక్లిష్టత్వము, అర్థముపొసగని పదముల కూర్పు, భావదారిద్ర్యమును ఆచ్ఛాదించు అనుచిత నిరర్థక