పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యములో రమ్యత

203


ఎక్కువగా ఆకాశములో పోవుచున్నది. రథం కనబడినపు డెల్లా మెడతిప్పి చూచుచున్నది. శరపతన భయముచేత. వెనకటి భాగము పూర్వకాయములోనికి చొచ్చుకొన్నట్లుగా కనబడుచున్నది. పరుగెత్తు అలసటచేత నోరు తెరచుకొనడమువల్ల సగం సగం కొరకిన దర్భలు అక్కడక్కడ దారిలో పడి అది పోయిన జాడ తెలుపుచున్నవి. కవులు సౌందర్య ప్రియులు కాబట్టి దు:ఖావస్థలోకూడ కాళిదాసును ఆ జింక రమణీయ భంగిమమే ఆకర్షించినది. ఈ చిత్రము చాలా అభిరామముగా ఉన్నదని కవియే సర్టిఫికేటు ఇచ్చు కొన్నాడు.

శకుంతల సఖీసహితముగ పూలతీవలకు నీళ్ళు పోయుచు “పియంవద నిర్దయముగ నాకంచెలవల్కలమును బిగించి ముడివేసినది. కొంచెము సడలించు” మని అనసూయను అడుగుచున్నది. “అనుక్షణ విజృంభమాణమైన నీ యౌవనాన్ని అడగవమ్మా" అని అనసూయ చలోక్తులాడుచున్నది. ఈ మాటలకు సిగ్గుతో తలవంచుకొన్న ముద్దరాలు, శకుంతల, దుష్యంతుని కన్నులకు నిర్వాణ సామ్రాజ్యమై కనుపట్టిన శకుంతల నేటికికూడా మన కన్నులకు ఆ విధము గానే పొడకట్టుచున్నది.

క్షణే క్షణే య న్నవతాముపైతి,
తదేవ రూపం రమణీయతాయా?

అను సూక్తికి ఉదాహరణ ప్రాయములయి ఈ దృశ్యములు మనలను మంత్రముగ్ధులను చేయుచున్నవి.