పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

కవికోకిల గ్రంథావళి

ప్రతిభావంతుడైన కవికి అపూర్వ వస్తునిర్మాణక్షమమైన ప్రజ్ఞ ఉండును. అద్దములో బింబము ప్రతిఫలించినట్లుగా సహృదయుల హృదయములందు భావచిత్రములను ప్రతిఫలింపజేయు వర్ణనాశక్తి కవికి స్వభావసిద్ధముగ ఉండును. ఈ శక్తి యేకవికి పరిపూర్ణముగ నుండునో అతడు అమరకవి. వానిది సార్వకాలీనమైన అమరకవిత.

కవి కులగురువైన కాళిదాసునందు ఇట్టి భావ చిత్ర రచనా కౌశలము పరమావధి నొందినది. మేఘసందేశ మంతయు ఇట్టి రమణీయ చిత్రముల పరంపరయేగదా! రమణీయ వస్తువు నిరంతరము సంతోషమును చేకూర్చునని కీట్సు కవి చెప్పినట్లుగా మనోహర భావచిత్రములు, దృశ్యములు, జరా మరణావస్థలు పొందక మనభావలోకముపై అధికారము చెలాయించు చుండును.

చూడండి, కాళిదాసు చిత్రించిన జింక ఎంత రమణీయముగను ప్రాణవంతముగను మనకు భావగోచరమగు చున్నదో.

గ్రీవాభంగాభిరామం ముహు రనుపతతి స్యందనే బద్దదృష్టి!
పశ్చార్దేన ప్రవిష్ట శ్శఠపతనభియా భూయసా పూర్వకాయం
దర్భేరర్ధావలీడై శ్రమవివృతముఖ భ్రంశిభిః కీర్ణవర్త్మా
పశ్యాదగ్రప్లుతత్వా ద్వియతి బహుతరం స్తోక ముర్వ్యాం ప్రయాతి,

దుష్యంతుడు మృగయావినోదలాసుడయి రథమెక్కి విల్లెక్కు పెట్టి జింకను వెన్నంటి తరుము కొనుచున్నాడు. జింక శరవేగముతో పరుగెత్తుచున్నది. అది చెంగలించి పరుగెత్తుటచేత కొంత భూమిపైన కాళ్ళానుచున్నవి.