పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యములో రమ్యత

ఏ కావ్యము సహృదయుల రంజింపజేయునో ఆ కావ్యమునందు రామణీయకము తప్పనిసరిగా ఉండును. అట్లు లేనియెడల రంజకత్వమునకు హేతువుండదు. మన ఆలంకారికులలో అర్వాచీనుడైన పండితరాయలు 'రమణీయార్థ ప్రతిపాదక శబ్దము కావ్యమ'ని చెప్పినట్లుగ నే అమెరికా దేశపుకవి, కథకుడు అలన్ పో కూడ “లయాబద్ధమైన సౌందర్యసృష్టి యే కవిత్వమ”ని నిర్ణయించినాడు. కావ్యమునందు రామణీయక ముండవలెనన్న అభిప్రాయము ప్రాచ్య పాశ్చాత్య లాక్షణీకులకు: కవులకు సమ్మతమైయున్నది.

కావ్యసమర్పితమైన రామణీయకము ఎట్టిది ? ఇదమిద్దమని నిర్ణయించుటకు తగిన జగదేకమైన మానదండము లేదు. రామణీయకము బాహిరమేకాక ఆంతరిక మనఃస్థితికి కూడ సంబంధించినది. ప్రతివ్యక్తికి అనుభవైక వేద్యముగా నుండు సౌందర్యము. అవ్యక్తియొక్క సంస్కారము, హృదయ పరిపాకమును అనుసరించి వృద్ధిక్షీణతలను పొందును. అయినప్పటికిని స్టూలముగను, మార్గసూచకముగను కొన్ని సామాన్య లక్షణములు గోచరించకపోవు.

కవిత్వములోని రామణీయకము ఏకవస్తువుగాదు, ఏక గుణమును గాదు. వస్తుగుణములు ఉచితమైనరీతిగా సమ్మేళింపబడి, కవిప్రతిభచేత సచేతనమై ఆకృతిబద్దమైన భావముయొక్క సమిష్టి మోహనత్వమె సౌందర్యము,