పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కవికోకిల గ్రంథావళి

లాక్షణికులు తత్త్వవేత్తలును తార్కికులును కావున వారిబుద్ధి యవయవ పృథఃకరణమునందు నిశితముగఁ బ్రవేశించును. వా రొకరూపముయొక్క యంగాంగ సంయోగతను సమష్టి సౌందర్యమును గమనింపక, యవయవములను, గుణములను ఆత్మను వేఱుపఱచి వానిలో నేవి ముఖ్యములో యను దీర్ఘ చర్చలకుఁ దొడంగి తుదకుఁ దమ యభిమానమునకుఁ బాత్రమైనదానికిఁ బట్టాభిషేకము గావింతురు. కాని, వానివాని స్థానములందు ఉచితమైనరీతిని అవియవి ముఖ్యములనియు, వానిలో నేవి లోపించినను అంగవైకల్యమో గుణవైకల్యమో లేక ప్రాణాపాయమో సంభవించు ననియు వారు తలంపరు.

“తదదోషౌశబ్దార్థౌసగుణౌ అనలంకృతీపునః క్వాపి” అని మమ్మటుఁడు కావ్యలక్షణమును నిర్వచించెను. కాని, యీ వాక్యమును సాహిత్యదర్పణకారుఁడును, రసగంగాధరకర్తయు విమర్శించి తీవ్రముగ ఖండించియున్నారు. నిర్దోషత్వముచేత కావ్యత్వము సిద్ధించునెడలఁ బ్రాణరహితములగు కావ్యములు గూడ సమ్మానార్హములగును. పేరువడసిన యుత్తమ కావ్యము లందేవో కొన్ని దోషములున్న యెడల అట్టి కావ్యములు ఆదరణపాత్రములు గాకపోవలసి వచ్చును. ఇట్టి ప్రమాణము నంగీకరించినయెడల మనకావ్య ప్రపంచము చాల సంకుచితమై పోఁగలదు. ఎట్టి యుత్తమ కావ్యమందైనను ఏదోయొక విధమైన దోషములు కొన్ని యుండకపోవు. రామాయణ మహా కావ్యము నందు పునరుక్తిదోషములు గలవు, మమ్మటాది సంస్కృత