పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రలక్షణము

193


డీవేళ నకాలమరణము నొందెను; నాప్రియపుత్రకుని యమాలయమునుండి మరలఁ దెచ్చి యియ్యవలయు” నని యడిగెను. రాజు తత్షణమె తన యమోఘ తపః ప్రభావము చేత యముని సమ్ముఖమునకు రప్పించి “బ్రాహ్మణ పుత్రకుని పునర్జీవునిగ నొనరింపు" మని కోరెను. యముఁడందులకు సమ్మతింపక పోవుటవలన నిరువురికి ఘోర యుద్ధముజరిగెను. తుదకు యముఁడు పరాజిత ప్రాయుఁడుకాఁగా, బ్రహ్మ యరుదెంచి వారిరువురిని సమాధానపఱచి, “నీవు బ్రాహ్మణ పుత్రకుని రూపము ననుసరించి రంగులతో నొక చిత్రపటమును లిఖంపుము”. అని రాజుతోఁ జెప్పెను. అందుకు సమ్మతించి రాజు చిత్రమును లిఖంచెను, అంతట బ్రహ్మ యా చిత్రమును బ్రాణవంతముఁ గావించి బ్రాహ్మణున కొసఁగెను.

“నీవు నేఁ డేవిధముగ నగ్న ప్రేతముల జయించితివో, యదే విధముగఁ జిరకాలము నగ్న జిత్తుడవగుదువు గాక” అని బ్రహ్మ రాజును దీవించెను. చిత్రకారుఁడు దేవదానవుల రూపములను జిత్రించి వారిని వశ్యము చేసికొనఁగలఁడు అను ఉద్దేశమె చీనా, టిబెట్ దేశముల చిత్రవిద్యల మూలతత్త్వము.

నగ్నజిత్తు రచించినదే భూలోకమునఁ బ్రథమ చిత్రము. . ప్రాచీన భారతీయ గ్రంథములందుఁ గొన్ని స్థలములలో నగ్నజిత్తు సమాచారము గోచరించుచున్నది. శకుని గాంధారుల తండ్రియగు గాంధార రాజునకు సబలుడనియు, నగ్నజిత్తనియుఁ బేరులుగలవు. ఆయన "ప్రహ్లాద శిష్యుఁ