పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినవాంధ్ర సాహిత్యము

189

'...... that passion, colour, and originality can not atone for serious imperfections in clearness, unity or truth.' కావ్యమునకు ముఖ్యమైన గుణములలో భావ స్ఫుటత్వ మొకటి యని ఈ విమర్శకుని యభిప్రాయము.

భావములు వాచ్యములుగనె యుండవలయునా ? వ్యంగ్యముగ నుండకూడదా? అని కొందఱు ప్రశ్నింప వచ్చును. భావస్ఫుటత్యము వ్యంగ్య మర్యాదకు విరోధి కాదు. ప్రకరణార్థము గోచరించుచునే తదతిరిక్తమైన వేఱొక భావము స్ఫురించవచ్చును. క్లిష్టార్థ సమన్వితములైన పద్యములను దీసికొని యవి వ్యంగ్యప్రధానములని సమర్ధించుట ఇప్పుడొక యాచార మైనది. ధ్వని ప్రధానములని యెన్నబడు సంస్కృత శ్లోకములలో ప్రకరణమునకు సంబంధించిన యర్థము సులభగ్రాహ్యముగనే యుండును.

రామబ్రహ్మముగారు బూతుకథల విమర్శించిరి. వీరికి బూతుకథ పై గలిగిన ఆగ్రహము అభినవసాహిత్యము నంతటిపై ప్రసరించి వారి విమర్శనమునకున్న విలువను తగ్గించినది. బూతుకథలు వెలువడుచుండుట యదార్థమేగాని అభినవ సారస్వతమంతయు ఈ బూతులుతప్ప మఱి యింకేమి లేదని చెప్పుట ఆ సాహిత్యముతోడి వీరి పరిచయ మెంత పాటిదో మనకు గోచరించుచున్నది. మున్నటి వైనను నేటివైనను బూతులు బూతులే. నాగర కాభిరుచిగలవారికి అట్టి కథలు ఏవము పుట్టించును. అట్టి కథకులు ఏ స్త్రీలను సంస్కరించుటకు (గిరీశమువలె) ప్రయత్నించుచున్నారో ఆ స్త్రీల ఆత్మగౌరవమునకే అట్టి కథలు భంగకారులుగ నున్నవి.