పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినవాంధ్ర సాహిత్యము

185


సాహాసమలవడదు. ఒకొక్కప్పుడు మనము స్వాతంత్ర్యమును దుర్వినియోగ పఱచుచుండుటయు కలదు. స్వాతంత్ర్యము దుర్వినియోగపడునను భయముతో పారతంత్ర్య మనుభవించుట భావ్యముకాదు. తప్పులు చేయనిదే యొప్పులు నేర్చుకొనము. ఒక నూత్న సంప్రదాయము కరుడుగట్టు ప్రథమదశ యందు యిట్టి దోషము లుప్పతిల్లుచుండును. రవీంద్రనాధ టాగూరుగారు కవిత్వము వ్రాయ ప్రారంభించిన కాలముననే నూత్న సంప్రదాయముకూడ అంకురించుచుండినది. దానికి టాగూరుగారుకూడ కొంత వఱకు బాధ్యులు. ప్రథమమున వీరు వ్రాయుచుండిన బంగాళీ కవిత్వము అర్థమగుట లేదని అందఱు గోలపెట్టిరి. ఇప్పుడు మన కవిత్వమున గోచరించు దోషములు అప్పుడు ఆయన కవిత్వములో కూడ దొరలినవి. దీనిని గుఱించి తన “జీవనస్మృతి ” యందు కొంత సమర్థించిరి.

ఈ సందర్భమున అభినవకవుల కష్టములను గూడ మనము గుర్తింపవలయును. వార్తాపత్రికల మూలమునను, వివిధ గ్రంథబాహుళ్యము వలనను నేడు ప్రపంచమంతటితో మనకు సంబంధమున్నది. కావున మన భావములుకూడ విరివియైనవి. మన భాష మన భావములతో పాటు వృద్ధిపొందలేదు. New phraseology to express Dew ideology" " అన్నట్లు, క్రొత్తభావములను, అందలి తరతమ చ్ఛాయలను వెలిపుచ్చుటకు క్రొత్తరకపు పదముల కూర్పు ఆవశ్యకమగును. కవి యొక్క భాషాప్రభుత్వము, పదములు కూర్చు నేర్పు ఇట్టి యెడ నుపకరించును.