పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

కవికోకిల గ్రంథావళి

ఈ అభినవ కవితోద్యమ ఫలితముగ కొంత పునరుద్ధరణము, కొంత నూతన సృష్టి కొనసాగినది. “ద్విపద కావ్యంబు ముదిలంజ...”అని తిరస్కరింపబడిన ద్విపదలు, పల్లెపదములు, పునర్గ్రహణ యోగ్యములైనవి. ఖండకావ్యములు, గేయములు, నవలలు, నాటకములు, ఏకాంక నాటికలు, ఉపకథలు, వ్యాసములు పుట్టినవి ఇవి యన్నియు తెలుగువాణికి నూత్నాలంకారములె. ఈ యిరువదియైదు సంవత్సరములనుండి పుట్టిన వాఙ్మయము విమర్శించుటకు తగినంత విరివిగా నున్నది. ఏసమర్దుడైనను నిష్పక్ష పాతబుద్దితో ఈ వాఙ్మయమును విమర్శించినయెడల చాల ఉపయోగకరముగ నుండును.

అభినవ కవిత్వమును గుఱించి యిప్పుడిప్పుడే కొన్ని యాక్షేపములు, ప్రత్యుత్తరములు బయలుదేరు చున్నవి. కాని, ఆ క్షేపములవలెనే ప్రత్యుత్తరములుకూడ మూక ఉమ్మడిగ నున్నవి. ఈ కాలమున వ్రాయబడునదంతయు చెత్తయని తృణీకరించుట యెంత అసమంజసమో ఈ నాటి రచనలన్నియు మహోత్కృష్టములని ప్రశంసించుటకూడ నంత యవిచారమూలకమె. బాగోగులు ఒక వర్తమాన కాలమునకే సంబంధించినవి కావు. చెత్త వ్రాసినవారు పూర్వముకూడ కలరు. అయితే ఆ చెత్తకును మనకును నూరులకొలది సంవత్సరముల అంతరమున్నది. కావున, ఆ చెత్త యంతయు క్రుళ్ళి కాలప్రవాహమున కొట్టుకొని పోయి అంతస్సారముగల యేకొన్ని కావ్యములో నిలిచినవి. ఎచ్చటనో దాగియుండిన చెత్తలు పురాతనములన్నంత