పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అభినవాంధ్ర సాహిత్యము

181


ప్రబంధములే పాఠ్యగ్రంథములు, అభినవ కవితకు మానా లేదు. ప్రతి కవియు సొంతమానాలు సృజించుకొనవలసి యుండెను. ఒక సంప్రదాయము కరుడుకట్టిన వెనుక వ్రాయు వారి కంతకష్టముండదు. పిఠాపురమున సుబ్బారావుగారు స్థాపించిన అభినవ కవితా గ్రంథమండలిని ( లేక గ్రంథ మాలయో నాకు జ్ఞప్తిలేదు.) గుఱించిన యొక కరపత్రమును పూర్వమొకప్పుడు సి. వి. కృష్ణయ్యగారి యొద్ద నేను చూచితిని. అంగ్లేయ సాహిత్యములోని పేరిన తేనెగడ్డలను అభినవాంధ్ర కావ్యములలోనికి తెచ్చుట ఆ గ్రంథమండలి యుద్దేశములలో నొకటియని అందు వ్రాయబడి యుండినది. ప్రథమమున సుబ్బారావుగారి యుద్దేశ మెట్లుండినను తరువాత వారు రచించిన కావ్యములు స్వతంత్ర సృష్టులనియే చెప్పవలయును. ఆయన వెనువెంటనే యమార్గ మవలంబించినవారు అబ్బూరి రామకృష్ణారావుగారు. 1915, 1916 మొదలు పింగళి లక్ష్మీకాంతం, వెంకటేశ్వరరావుగార్లు, విశ్వనాథ సత్యనారాయణగారు, వేంకటపార్వతీశ్వర కవులు, శివశంకరశాస్త్రి గారు, కృష్ణశాస్త్రిగారు మఱి యింక కొందఱు ఈ నవీనమార్గము నవలంబించిరి. తరువాత క్రమ క్రమంగా ఇప్పుడు వ్రాయుచున్న కవులందఱు కొద్దిగనో గొప్పగనో స్వతంత్రముగనే రచించుచున్నారు. వీరందఱు ఏక మార్గావలంబికులయ్యును వ్యక్తిగత శిల్ప పరిపాకము ననుసరించి రచనలలో తారతమ్యము గోచరించును.