పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినవాంధ్ర సాహిత్యము

179


ప్రతిబింబమే కావున సంఘమున చెలరేగిన ఈ సంచలనము. ఈ ఆందోళనము, ఈ స్వాతంత్ర్యేచ్ఛ దానియందు మాత్ర మెట్లు ప్రకటితము కాకుండును?

ప్రబంధములలోని పచ్చి శృంగారము నేఁటి యభిరుచులబట్టి మొరటుగ తోచినది అందలి శబ్దలంకారములు, భావప్రేరకములుగాక కేవలము బుద్ధిపరిశ్రమకు వినియోగపడు తెచ్చికోలు అర్థాలంకారములు “intellectual gamnastics అని నిరసింపబడినవి. ఈ యసంతృప్తి ప్రతికూల విమర్శనముతోనే వ్యయమైపోక వాఙ్మయ నిర్మాణమునకు తోడ్పడినది. కందుకూరి వీరేశలింగం పంతులుగారు Vicar of Wakefield, Gulliver's Travels అను ఆంగ్లేయ నవలలను మానాగా పెట్టుకొని తెలుగు నవల రచనకు మార్గదర్శకులైరి. వారు షేక్స్‌పియరు నాటకములను తెనిగించిరి. నాటకములు, ప్రహసనములు, వ్యాసములు, ఖండకావ్యములు, కవిజీవితములు వ్రాసి పంతులుగారు ఆంగ్లేయ వాఙ్మయములోని కొన్ని రచనావిధానములను, సంప్రదాయములను తెలుగులో వెలయించిరి.

వాఙ్మయ రచనలలో కలిగిన మార్పులతో పాటు భాషావిషయములందుకూడ కొంత సంచలనము ప్రారంభమైనది. గ్రాంథిక భాష కృత్రిమమనియు సహజమైన వ్యావహారిక భాషలో వ్రాయుట ఆవశ్యకమనియు గురజాడ అప్పారావుగారు, గిడుగు రామమూర్తి పంతులుగారు తలంచి అందుకు కావలసిన మందుగుండు సామగ్రితో గ్రాంథికభాషా వాదులను ముట్టడించిరి. ఈ యుద్యమమునకు ఫలితముగ