పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

177


దున పద్యమూ కాదు; త్రిశంకునివలె నడుమంతరమున వ్రేలాడుచు రెంటికిం జెడిన రేవడ యైనది.

ఎంతకాలమైనను తెలుగు కవిత్వమునకు ఆ వృత్తాలు ఆ సీస గీత పద్యము లేనా వేరేమీ గతి లేదా యని యందురేని, కలదని నేను మనవి చేయుచున్నాను. క్రొత్త ఛందస్సులు ఆవిష్కరించుకొని కవిత్వము వ్రాయవచ్చును. అవి శ్రవణ సుఖముగా నున్న యెడల నిలిచియుండును. ప్రస్తారము వలన ఎన్ని వృత్తములు పుట్ట లేదు! అవి అన్నీ మన చెవికి రుచించుట లేదు. రుచించినవి మాత్రము నిలిచియున్నవి.

ఆడినదల్లా ఆట కాదు. పాడినదల్లా పాట కాదు. శిల్పముసకు సంయమనము (restraint) అవసరము. వీనియందు అటువంటిది కన్పించదు.

శ్రీ శ్రీ గారు నవకవులు సాధించిన మహాసిద్ధి యని తెలుగుదేశమునకు శిఫారసు చేసిన ఈ ఫిడేలరాగాల డజన్‌ను గురించి రెండు మాటలు, ఆ పుస్తకము చదివినప్పుడు నాకు కలిగిన భావమిది : యౌవన ప్రాదుర్భావ సమయమున కామోద్రిక్తుడయి “కామార్తాహి ప్రకృతికృపణా చేతనా చేత నేషు" అను కాళిదాసు సూక్తికి ఉదాహరణ ప్రాయుడయి వలపు పస్తులతో నవసి మతిచెడిన యువకుని ఉన్మత్త ప్రలాపములు (Mad ravings)గా నాకు స్ఫురించినది. బుర్రా వేంకట సుబ్రహ్మణ్యంగారు చెప్పినట్లు ఒక్క Cleverness ఉన్నంతనే కవిత్వము కాదు.


___________