పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

173

పూర్వము సిద్ధమైయుండినవి చక్కగ తెలుసుకొనక పోవుటచేత నవకవులకు, ఇట్టివి అపూర్వసిద్ధులుగ తోచును, ఇంతయేల? శ్రీశ్రీగారు ఎంతవరకు తమ వాదమును ఆచరణలో పెట్టగలిగిరో తెలుసుకొనుటకు వారు రచించిన intro ను ఉదాహరణముగ తీసుకొనవచ్చును. వారు తమ వాదము ప్రకారము పీఠిక యంతయు క్రియలతో నింపియుండిన ఇతరులు విమర్శింపవలసిన యవసరము ఉండియుండదు. ఏలయన ఆ భాష మనుష్యులకు అర్థము కాదు. శ్రీశ్రీగారుకూడ విభక్తి విశృంఖలముగా షికారు పోజాలనందుకు సంతోషము. విభక్తులు లేని వాక్యము అన్యోన్యసంబంధము లేని పదసమూహముగ తోచునేగాని భావము తెలుసుకొనుట దుర్లభము. తామే అనుసరింపలేని తియరీలను ఇతరులపై పారవేసి వారిని చీకాకుపెట్టుట యెందుకా అని నాచింత. అయితే దీనికొక సమర్దనమున్నది. నవకవులు, తమ కవిత్వమునకు తమకు ఏలాటి సంబంధము లేదను సమ్మకముకలవారు కావున వారి తియరీలు ఒక వంక వారిరచనలు మరొకవంక నడువవచ్చును,

“కవులు స్వాతంత్ర్యదూతలు స్వేచ్చా దాతలు”, నిజమే. నిరంకుశాః కవయః అనే పలుకుబడి పూర్వమునుండి వ్యాప్తిలోనున్నది. అయితే ఒక్క భేదము మాత్రము కనబడుచున్నది. పూర్వులది నియమబద్ధమైన స్వాతంత్ర్యము. మనవారిది అరాజకమైన విశృంఖలత్వము, కాళిదాసువంటి ప్రతిభాసంపన్నుడైన మహాకవికికూడ “ప్రాంశు లభ్యే ఫలే లోభా దుద్బాహురివవామనః” అని అడకువచేత తన గొప్పతనమును తెలుపుకొనగా, ఒకటిన్నరపేజి చక్కగా వ్రాయ