పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

172

కవికోకిల గ్రంథావళి

కర్త తేలికగా ఊహించుకొనబడును, మూడవ వానిని గురించి చెప్పునప్పుడు “వస్తాడురా" అని అంటే “ఎవడురా " అని రెండవవాడు ప్రశ్నింపవలసి యుండును. రాముడు రా" అని మరల వీడు జవాబు చెప్పవలసియుండును. ఇట్టి సంశయము, కాలహరణము, ఇబ్బంది తొలగించుటకే ఒక వాక్యమున ఒక కర్త ఒక క్రిఁయు అవసరమని చెప్పిరి. ఈ నియమము మన భాషకే కాదు. అన్ని భాషలలో నున్నది. ఈ నియమము ప్రాచీనము కాబట్టి నవకవులకు గ్రాహ్యముకాదని చెప్పుటకు వీలు లేదు. కొన్ని నియమములు మనము వదలదలచుకొన్నను అవి వదలవు. ఈ నియమమును బహిష్కరించి శ్రీశ్రీ గారి కోరిక ప్రకారము ఒక్క క్రియకే యేకచ్చత్రాధిపత్యము కట్టిపెట్టిన యెడల మన భాష మూగ చెవిటివారి భాషయగును. ఇది క్రొత్త ఆవిష్కరణముకాదు. ఒక గొప్ప సిద్ధియుకాదు.

కవులకు భాషను పొదుపుచేయు గుణమున్నది. కవి ఎన్ని తక్కువ మాటలతో క్లీష్టాన్వయ దోషము లేకుండ చెప్పగలడో అన్ని తక్కువ మాటలతో తన భావమును వెల్లడించును. అట్లు చేయలేనియెడల కవిదే దోషము. ప్రకరణమునుబట్టి కర్తనుగాని కర్మనుగాని ఊహించుకొనుట సులువైనయెడల వానిని పరిత్యజించును. “వచ్చెడువాఁడు ఫల్గుణుఁడవశ్యము గెల్తుమనంగరాదు” అని తిక్కనవ్రాసెను. గెల్తుము అను క్రియ కర్మను అపేక్షించుచున్నది. ఎవరిని గెల్తుము? పాండవులను. తిక్కన పాండవులను అని వ్రాయ లేదు. ప్రకరణమునుబట్టి ఊహించుకొనవచ్చును.