పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

169


లంగా షికారు పోవచ్చు. ప్రతిఫలం విచిత్ర సౌందర్యం. విచిత్రమే సౌందర్యం - సౌందర్యమే విచిత్రం.

ఛందస్సుల చండ శాసనానికికూడా కాలం వెళ్ళి పోయింది. కవి హృదయంలో రాగాలపస ఎట్టి తీగలు సాగితె అదే గీతానికి ఆధారం నిర్ణయించాల. నవకవికి అనుకరణ అసహ్యం. ఇవన్నీ ఋణపక్షాన నవకవుల తిరుగుబాటు. వారు సాధించిన ధనం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తారా చదవండి ఫిడేలు రాగాలడజన్ .

శ్రీశ్రీగారు ఉద్దేశించిన నవకవులు ఒకరిద్దరు తప్ప శ్రీ శ్రీ గారితో సహ నాకు మిత్రులు. వారి సౌజన్యముపైన నాకు నమ్మకము కలదు. ఒక వేళ వారు “వచన పద్యాలనే దుడ్డుకర్రలతో పద్యాల నడుములు విరుగ దంతాము” అని నిరాఘాటముగా చాటినప్పటికిని వారిలో ఎవ్వరిలోను ఇటువంటి గడుసుదనము నాకు కనిపించలేదు. అందుచేత అభిప్రాయ భేదములు నాగరకుల స్నేహమునకు భంగము కలిగించవని నానమ్మకము.

రాయప్రోలు సుబ్బారావుగారి Manifesto లో సిద్దాంతీకరింపబడిన కొన్ని విషయములను గురించి నాకు అభిప్రాయ భేదము లున్నప్పటికిని కవితావిషయమై వారు కావించిన నిర్ణయములను గురించి నాకు భిన్నాభిప్రాయము లేదు. అవి సర్వాంగీకార పాత్రములయి సాంప్రదాయికముగ అలవాటులోనున్న నియమములె. కవిత్వమున రస రామణీయకములు ఔచిత్యము ఉండ నక్కరలేదని యెవరు చెప్పరు.